ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న వరదలు

ఆంధ్రప్రదేశ్‌ను వరదలు వణికిస్తున్నాయి. ఓవైపు ఎడతెరిపిలేని భారీ వర్షాలు.. మరోవైపు ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రవాహంతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు ముంపు ముంగిట నిలిచాయి. అటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపానికి లోతట్టు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి.

ఏపీలో వరుణుడు పూర్తిగా శాంతించలేదు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉభయగోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

పశ్చిమలో ఎర్రకాల్వ జలాశయానికి గండి పడింది. చోడవరం గ్రామం నీట మునిగింది. 60వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

గోదావరి ఉగ్ర రూపానికి లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. నడుములోతు నీళ్లలో నానుతూ క్షణమొక యుగంలా అక్కడి ప్రజలు కాలం వెల్లదీస్తున్నారు. ముమ్మిడివరం మండలం వలసతిప్పి, పొట్టితిప్ప, సలాదివారిపాలెం, గంగవరం, మండలం శేరుల్లంక, సీతారమపురం, చినపేట, తాళ్లరేవు మండలం కొత్తలంక గ్రామాలు ఒక దీవిగా ఉండే లంక ప్రాంతంలో ఉన్నాయి. గతంలో పడవ ప్రమాదాల దృష్ట్యా.. ఇప్పుడు పడవలు నిలిపేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అల్లవరం మండలంలో బోడసకుర్రు పల్లిపాలెం, గోపాయిలంక తదితర గ్రామాల్లో వరద నీటి ఉధృతికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో వారంతా దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు. దాదాపు 50 ఇళ్లు వరదనీటిలో నానుతున్నాయి. కంసాలమామిడిలో 20 గృహాలు నీట మునిగాయి.

భారీ వర్షాలతో లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్త పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చోడవరం మండలంలో ఆయన పర్యటించారు. వరద పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వరద బాధితులకు ధైర్యం చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ జలాశయం పొంగిపొర్లుతోంది. అక్కడి నుంచి వచ్చే వరద నీరు కిందనున్న పంట పొలాలను.. గ్రామాలను ముంచెత్తింది. రాత్రి 27 వేల క్యూ సెక్కుల నీరు ఒక్కసారిగా కిందకు రావడంతో నల్లజర్ల మండలంలోని చోడవరం గ్రామం నీట మునిగింది. గ్రామంలోని సుమారు పది వేల మంది డాబాలపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంట్లోని ఆహార పదార్ధాలు, ధాన్యం, బట్టలు అన్నీ వరద పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలో వయ్యూరు కాలువ ఉధృతంగా పొంగి ప్రవహించడంతో దువ్వ గ్రామంలోకి నీరు ప్రవహిస్తోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 22 కుటుంబాలకు హైస్కూలులో ఆశ్రయం కల్పించారు అధికారులు.

కృష్ణా జిల్లాలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. వరినాట్లు నీట మునిగాయి. పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ జలమయం అయింది. ఆటో నగర్‌, రోటరీ నగర్‌ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అమరావతి సైతం నీటిలో నానుతోంది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు వరద తాకిడికి గురయ్యాయి.

మరోవైపు గుంటూరు జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగడంతో ఇబ్బందులు తలెత్తాయి. పంట నీట మునగగా.. రోడ్లు దెబ్బతిన్నాయి. జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌.. అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేశారు.