నాటింగ్‌ హామ్‌లో కోహ్లీసేన గ్రాండ్ విక్టరీ

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఎట్టకేలకు తొలి విజయాన్ని రుచి చూసింది. నాటింగ్ హామ్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో కోహ్లీసేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. 521 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగోరోజు ఆరంభంలోనే 4 కీలక వికెట్లు కోల్పోయినా… బట్లర్,స్టోక్స్ పార్టనర్‌షిప్‌తో కోలుకుంది. అయితే నాలుగోరోజు చివరి సెషన్‌లో బూమ్రా ధాటికి ఇంగ్లాండ్ వరుస వికెట్లు చేజార్చుకుంది. చివరి వికెట్‌ను ఇవాళ తొలి సెషన్‌లోనే భారత్ పడగొట్టి విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరుగులు చేయగా… ఇంగ్లాండ్ 161 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ 352 పరుగులు చేసి మ్యాచ్‌ను శాసించింది.

తొలి రెండు టెస్టుల్లోనూ ఓడిపోవడంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే మూడో టెస్టులో సమిష్టిగా రాణించిన కోహ్లీసేన ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాతో పాటు పేసర్ బూమ్రా కీలకంగా చెప్పొచ్చు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేజార్చుకున్న కోహ్లీ… రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకం సాధించాడు. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో పాండ్యా చక్కని బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఐదు వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ కూడా చేశాడు. ఇక స్టోక్స్, బట్లర్ పార్టనర్‌షిప్‌ను బ్రేక్ చేయడం ద్వారా బూమ్రా భారత్‌కు విజయాన్నందించాడు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని భారత్ 1-2కు తగ్గించింది.