పేదింటి బిడ్డ పెద్ద కొలువు.. ఎస్పీ అయిన కండక్టర్ కూతురు

లక్ష్యం ముందు పేదరికం చిన్నబోయింది. ఆశయం ముందుకు నడిపిస్తుంటే ఆర్థిక బాధలు సైతం వెనకడుగు వేశాయి. ఓ సారి అమ్మతో కలిసి బస్‌లో వెళుతున్న శాలినీ పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. శాలినీకి వారి పట్ల కోపం వచ్చినా అమ్మ వద్దని వారించడంతో ఆగిపోయింది. బాగా చదువుకుని జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉంటే ఇలాంటి వాళ్ల ఆటలు కట్టించొచ్చు అన్న తల్లి మాటలు శాలినీ మనసులో బలంగా నాటుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శాలినీ అగ్నిహోత్రి జిల్లా ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించి అమ్మ కలను నిజం చేసింది. తల్లి శుభలత అగ్నిహోత్రి, తండ్రి రమేశ్. ఓ అక్క, తమ్ముడు ఉన్న చిన్న కుటుంబం శాలినీది. తండ్రి బస్ కండక్టర్. తల్లి ఇంట్లో బట్టలు కుడుతూ నాన్నకి చేదోడు వాదోడుగా ఉండేది. ధర్మశాలలో పదవ తరగతి పూర్తి చేసిన శాలిని, డిగ్రీ పూర్తి చేసిన తరువాత సివిల్స్ చదవాలని నిర్ణయించుకుంది.

ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. కొత్త విషయాలు నేర్చుకోవడం, పేపర్లు చదవడం, నెట్ ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవడం ఇవన్నీ నిరంతరం కొనసాగించడం వల్ల సివిల్స్‌లో మంచి ర్యాంకు రావడానికి దోహద పడింది. అలా 2012లో సివిల్స్‌లో 285వ ర్యాంకు సంపాదించారు. పోలీస్ ఆఫీసర్ కావాలన్న తన ఆశయంతో ముస్సోరీ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందారు. హైదరాబాద్ం‌లో 65వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. 148 మంది ఐపీఎస్‌లో ట్రైనింగ్ తీసుకుంటే వారిలో టాపర్‌గా నిలిచారు శాలినీ. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే పోస్టింగ్ వేశారు. షిమ్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న శాలినీ 8 ఏళ్ల వయసున్న కళ్లులేని చిన్నారి గ్యాంగ్ రేప్‌తో పాటు కొన్ని సవాళ్లతో కూడిన కేసులని ఎన్నింటినో దర్యాప్తు చేసి నిందితులకు శిక్షలు పడేలా చేశారు. అక్క డెంటల్ సర్జన్‌గా, తమ్ముడు ఇండియన్ ఆర్మీలో లెప్టినెంట్‌గా సేవలు అందిస్తున్నారు.