కేరళలో ఆవిరైపోయిన ఓనం పండుగ సంబరాలు

వరుణుడి ఆగ్రహంతో కకావికలం అయిన కేరళ ఇప్పడే కుదుటపడుతోంది. వరుణుడు శాంతించడంతో సహాయకచర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకే పునరావాస కేంద్రంఆలలో ఉన్న ప్రజలు ఇప్పడిప్పడే ఇళ్లకు చేరుకుంటున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎస్, త్రివిధ దళాల బృందాలు సహాయక చర్యలను మరింత పెంచాయి. కొల్లాం, అలెప్పీ, త్రిచూర్ ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాలు ఇప్పడిప్పడే కోలుకుంటున్నాయి. ప్రజలు ఇంటికి చేరుకుని బురద తొలిగించుకుంటున్నారు. చాలామంది కట్టుబట్టలతో బయటకు రావడంతో ఇంట్లో వస్తువులన్నీ పాడయ్యాయి. దీంతో పునరావాస కేంద్రాల్లో ఇచ్చిన ఆహారం, బట్టలు వాడుకుంటున్నారు. ఇళ్లను నివాసయోగ్యంగా మార్చడానికి కొద్ది వారాలు పడుతుందని అంటున్నారు.

అటు రవాణా సదుపాయాలపై దృష్టి పెట్టారు. వరదల వల్ల రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద కారణంగా దెబ్బతిన్న ట్రాకులకు మరమ్మత్తులు చేసి యధావిధిగా షెడ్యూల్ ప్రకారం రైళ్లు నడిపుతున్నారు. బస్సుల రాకపోకలు కూడా చాలావరకు గాడిలో పడ్డాయి. రోడ్లు కూడా వేగంగా పునరుద్దిస్తున్నారు. రవాణా సదుపాయాలు మెరుగుపడితే.. బాధితులకు సాయం త్వరగా అందుతున్న ఉద్దేశంతో అధికారులు వీటిపై దృష్టి పెట్టారు. విమాన సర్వీసులు కూడా 26 నుంచి అందుబాటులోకి వస్తాయని సివిల్ ఏవియేషన్ డిపార్ట్ మెంట్ తెలిపింది.

కేరళలో ఇంకా 10 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినా.. ఎర్నాకులం, త్రిస్సూర్, పతనంతిట్ట, అలప్పుజా, కొల్లాం జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధలోనే ఉన్నాయి. వరద ముంపులో చిక్కుకున్నవారిని దాదాపుగా రక్షించినా.. చివరి వ్యక్తిని కాపాడేంత వరకూ సహాయక చర్యలు ఆగవని రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ బలగాలు తెలిపాయి. గత ఐదు రోజుల్లో మొత్తం 1.63 లక్షల మందిని కాపాడారు. వరదలతో దెబ్బతిన్న ఇళ్ల శిథిలాలను, చెత్తను తొలగించడం సహాయక సిబ్బందిగా సవాలుగా మారింది. అంటు వ్యాధుల వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే కోటి క్లోరిన్‌ మాత్రల్ని పంపింది. అదనంగా 3 కోట్ల మాత్రల్ని పంపనుంది. 30 టన్నుల బ్లీచింగ్‌ పౌడర్, 1.76 లక్షల శానిటరీ న్యాప్కిన్లు కేరళ చేరాయి. తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారపదార్థాలు, వైద్యులు, నర్సులు కేరళకు ఇప్పుడు ఎంతో అవసరమని విజ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణం కోసం ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్‌ తదితర నిపుణులు అవసరముందన్నారు.

కేరళ ప్రజలు ఏటా ఎంతో అట్టహాసంగా జరుపుకునే ఓనం పండుగ సంబరాలు వరదలకు ఆవిరైపోయాయి. ఓనం సందర్భంగా ఆగస్టు 25న నిర్వహించే అన్ని కార్యక్రమాల్ని ప్రభుత్వం, వివిధ సంస్థలు రద్దు చేశాయి. పండుగ కోసం సేకరించిన నిధుల్ని వరద సాయం కోసం వెచ్చించనున్నారు. బక్రీద్‌ను సాదాసీదాగా జరుపుకోనున్నారు. కేరళ విజ్ఞప్తి మేరకు కేంద్ర ఆహార, ప్రజా సరఫరా విభాగం 89,540 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు ఓకే చెప్పింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మరో 100 మెట్రిక్‌ టన్నుల పప్పుధాన్యాల్ని పంపగా మరిన్ని నిల్వలు పంపేందుకు రెడీఅవుతోంది. రైల్వే 24 లక్షల లీటర్ల మంచినీటిని, 2.7 లక్షల వాటర్‌ బాటిల్స్‌ను పంపింది. మరో 14 లక్షల లీటర్ల నీటిని ఎర్నాకులం రైల్వే స్టేషన్‌ నుంచి సరఫరాకు ఏర్పాట్లు చేస్తోంది. రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించడంతో అన్ని రాష్ట్రాల నుంచి కేరళకు ఉచితంగా రైల్వే శాఖ సరకులను చేరవేస్తోంది. ట్యుటికొరిన్‌ పోర్టు నుంచి సహాయ సామగ్రితో మంగళవారం ఒక నౌక చేరుకుంది. ఇప్పటికే 50 వేల మెట్రిక్‌ టన్నుల పెట్రోలు, డీజిల్‌తో ముంబై పోర్టు నుంచి ఒక నౌక కేరళ చేరుకోగా ఐఎన్‌ఎస్‌ దీపక్‌ నౌక 800 మెట్రిక్‌ టన్నుల మంచినీళ్లు, 18 టన్నుల నిత్యావసరాలతో కొచ్చి పోర్టుకు చేరింది.

కేరళలోని సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న వరద బాధితులకు విష సర్పాలు స్వాగతం పలుకుతున్నాయి. బాత్‌రూంలు, కప్‌బోర్డులు, వాష్‌ బేసిన్లలో నాగుపాము, రక్తపింజరి పాములు హడలెత్తిస్తున్నాయి. గత ఐదు రోజులుగా కేరళలో పాముకాటు కేసులు భారీగా పెరిగాయి. వరదల కారణంగా మూగజీవాలు పెద్దెత్తున మృతిచెందాయి. దీంతో గ్రామాల్లో వాటి నుంచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు నిత్యావసరాల ధరలు ఆకాశన్ని అంటుతున్నాయి. వరదల కారణంగా సరఫరా లేకపోవడంతో ఉన్నవాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.