కేరళ వాసులకు కొత్త కష్టాలు…ఇళ్ళలోకి అనుకోని అతిథులు

కేరళలో వరద తగ్గటంతో ఇళ్లకు చేరుకుంటున్న జనాలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వరద మిగిల్చిన బురద, నీటిలో కొట్టుకొచ్చిన పాములు, జంతువుల కళేబరాలు వణికిస్తున్నాయి. మరోవైపు వరద కొనసాగుతున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. వరద ప్రభావంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించిన సీఎం విజయన్‌… కేంద్రం నుంచి 2600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ అడగాలని నిర్ణయించారు.

కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గటంతో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు బాధితులు. అయితే ఇళ్లన్నీ బురదమయం అయ్యాయి. పది రోజులుగా నీటిలోనే ఉండటతో ఇంట్లో వస్తువులన్ని ఎందుకూ పనికి రాకుండా పోయాయి. దీంతో అన్ని వస్తువులు మళ్లీ కొనుక్కోవాల్సిన దీన పరిస్థితి. దీనితోడు వరదకు కొట్టుకొచ్చిన పాములు, జంతువుల కళేబరాలతో పరిసరాలు దుర్గంధంగా మారాయి.

ఇక వరద తగ్గని ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. మరో 41 NDRF బృందాలు కేరళకు చేరుకున్నాయి. బాధితులను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరదలతో అంటు రోగాలు ప్రబలకుండా మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లు, విద్యుత్ పునరుద్దరణకు యుద్ధ ప్రతిపాదికన పనులు చేపడుతున్నారు.

మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వరద ప్రభావంపై చర్చించిన ఆయన… కేంద్రం నుంచి 2600 కోట్ల ప్రత్యేక ప్యాకేజిని కోరాలని నిర్ణయించారు. అలాగే వరద నష్టం, పునరావాస చర్యలపై చర్చిచేందుకు ఆగస్టు 30న అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరారు.

మరోవైపు జల విలయంలో చిన్నాభిన్నం అయిన కేరళను ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి తమ వంతు సాయం అందిస్తున్నాయి. సీఎం సహాయ నిధికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏడు వందల కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన తక్షణ సాయం 5 వందల కోట్ల కంటే యూఏఈ సాయం ఎక్కువ కావటం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు సాయం కొనసాగుతేఏనే ఉంది. కేరళను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వడంతో ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. దాదాపు వంద కోట్ల వరకు సాయం చేసినట్లు అంచనా. ఏపీకి చెందిన IAS, IPS, IFS అధికారులు కూడా ఒక రోజు వేతనం ప్రకటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ఒక నెల మూల వేతనం సాయంగా ప్రకటించారు. టీడీపీ ఎంపీలు తమ ఎంపీ కోటా నిధుల నుంచి 2 కోట్ల 10 లక్షలు ప్రకటించారు. ఎంపీ గల్లా జయదేవ్ ఒక నెల వేతనం ఇస్తున్నట్టు ప్రకటించారు. అమరావతి సచివాలయంలో ఏపీ జేఏసీలో భాగస్వాములు అయిన 98 ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి ఒక రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇటు తెలంగాణ జిల్లాలోనూ కేరళ వరద బాధితులకు సాయం అందుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయలతో పాటు సహాయ సామాగ్రిని తరలించింది. ఉద్యోగులు, స్కూలు విద్యార్ధులు కూడా తమకు తోచినంత సాయాన్ని అందిస్తున్నారు. సహాయ సామాగ్రితో వరంగల్ నుంచి బయల్దేరిన వాహనాన్ని కలెక్టర్ ఆమ్రపాలి జెండా ఊపి ప్రారంభించారు.