ఏపీలో శాంతించిన వరుణుడు.. భయపెడుతున్న వరదలు

ఏపీలో వరుణుడు శాంతించాడు.. భారీ వర్షాలకు కాస్త తెరిపి లభించింది. కానీ వరద కష్టాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో ఉధృత ప్రవాహం కనిపిస్తోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో 24 గంటలు పాటు వర్షాలు పడే అవకాశం ఉందని సూచనలు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు..

ఏపీలో వానలు ఆగినా.. వరదలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా గోదారి జిల్లాల్లో వరద లంక ప్రజలను కనీళ్లు పెట్టిస్తోంది. నాలుగు రోజులైనా నీరు తగ్గకపోవడంతో.. చేసేందుకు పనుల్లేక, తినేందుకు తిండిలేక అల్లాడుతున్నారు.

floods-in-eluru-ysr-colony

కోనసీమ మొత్తం భయానక పరిస్థితి నెలకొంది. వశిష్ఠ పాయలో ఏమాత్రం నీటి మట్టం పెరిగినా ఊరు మునిగే ప్రమాదం పొంచి ఉంది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అదే పరిస్థితి. వరుణుడు శాంతిచినా వరద పోటు తప్పడంలేదు.ప్రజలకు కష్టాలు తప్పడంలేదు.ఎర్రకాలువ ఉధృతి శరవేగంగా పెరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడుదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానాన్ని ఎర్రకాలువ వరద నీరు చుట్టుముట్టింది.అమ్మవారి ఆలయం జలదిగ్భంధంలో చిక్కుకోవడంతో ఆలయాన్ని మూసివేశారు.

ఏలూరులో ఎర్రకాల్వ వరదల కారణంగా చుట్టు పక్కల గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలోకి వరద నీరు భారీగా చేరింది. ఒక్కసారిగా వరద నీరు ఇంట్లోకి రావడంతో.. అత్యవసర వస్తువులను సైతం ఇంట్లోనే వదిలి ప్రాణాలు కాపాడుకునేందుకు డాబాలపైనే జీవనం గడుపుతున్నారు.. ఇంట్లో ఉన్న అన్ని వంట వస్తువులు నీటపాలవ్వడంతో తినేందుకు తిండి లేక అల్లాడుతున్నారు.

rains,

ఉభయ గోదావరి లంక గ్రామాల్లో ప్రస్తుతం పరిస్థితులు తేరుకునే అవకాశం కనిపించడం లేదు. మరో 3 రోజులు వరద కొనసాగే అవకాశం ఉండడంతో.. జీవనానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే 4 రోజులుగా పనుల్లేక ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు వరద తగ్గడానికి మరింత సమయం పట్టనుండడంతో.. పేదల కష్టాలు రెట్టింపయ్యాయి. అటు, పశువులకు కూడా ఆహారం అందించలేని పరిస్థితి ఇప్పుడక్కడ నెలకొంది. తూర్పుగోదావరిలోని 44 లంక గ్రామాల్లో సహాయ చర్యల్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నా.. సరైన సాయం అందక జనం మాత్రం అల్లాడిపోతున్నారు. నాటు పడవలపై ప్రయాణాల్ని నిషేధించడంతో.. లంకల్లోని వాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది.

floods-in-both-godhavari-districs

ఇక కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాయశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం గేట్లను మూసేసిన అధికారులు.. బుధవారం 3 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు వరద నీటిని విడుదల చేశారు.. ఇంకా ఈ ప్రవాహం పెరిగే అవకాశం కనిపిస్తోంది.

గుంటూరు నగరంలోని రోడ్లు నగరవాసులకు నరకం చూయిస్తున్నాయి.అభివృద్ది పేరుతో గత కొన్నేళ్లగా గుంటూరు నగరంలో రోడ్లను తవ్వటంతో ఎక్కడ చూసినా గుంతలు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కూడా తోడు కావడంతో రోడ్ల మీద గుంతలు నిండి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో జిల్లాలోని నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఒడిస్సాలో సైతం అత్యధిక వర్ష పాతం నమోదయింది. దీంతో.. వాగులు,వంకలు,నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పంటపొలాలన్నీ చెరువులుగా మారాయి. వరినాట్లు వేయడానికే ఎకరానికి 15 వేలు అవుతోందని ఇక..విత్తనాలు,ఎరువులకు మరో పదివేల వరకు ఖర్చవుతుందని.. మొత్తం ఎకరానికి 25 వేల రూపాయల మేర పెట్టిన పెట్టుబడి వరదల్లో కొట్టుకుపోయిందని బాధిత రైతులు లబోదిబోమంటున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -