నానమ్మా నువ్విక్కడా.. కన్నీళ్లాపుకోలేని చిన్నారి

స్కూల్‌నించి రాగానే అమ్మా.. నానమ్మేది అని అడిగింది చిన్నారి అఖిల.. రోజూ తనకోసం గుమ్మంలో కూర్చుని ఎదురు చూసే నానమ్మ కనిపించలేదు. బాబాయింటికి వెళ్లింది.. వచ్చేస్తుందిలే.. నువ్వెళ్లి ఫ్రెష్ అవ్వు.. ఏదైనా తిందువు గానీ అని అమ్మ అనే సరికి.. సరేనంటూ లోపలికి వెళ్లింది. కానీ నానమ్మ లేని లోటు కనిపించేస్తుంది ఆ చిన్నారికి. రోజూ స్కూల్‌నించి వస్తూనే నానమ్మ ఇంకా రాలేదా అని అడగడం తనవంతయింది.

లోపల బాధ ఉన్నా పైకి అంటే అమ్మ అరుస్తుందేమో అని భయం ఓపక్క. ఇదిలా ఉండగా ఓ రోజు స్కూల్లో పిల్లలకి వృద్ధాశ్రమాలు చూపించాలన్న ఉద్దేశంతో స్కూల్ యాజమాన్యం పిల్లలని ఆశ్రమాలకు తీసుకువెళుతున్నారు. అఖిల కూడా వెళ్లింది. అక్కడ వారందరినీ పలకరిస్తుంటే ఓ చోట కూర్చుని ఉన్న తన నానమ్మ కనిపించింది అఖిలకి. అంతే నానమ్మని చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది.

ఇక్కడున్నావేంటి నానమ్మా అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. నానమ్మకి కూడా మనవరాలిని చూడగానే ఏడుపు ఆగలేదు. తన బాధనంతా గుండెల్లోనే దాచుకుని నేనిక్కడ బాగానే ఉన్నాను. నువు బాగా చదువుకో అంటూ ఆశీర్వదించింది. అమ్మానాన్న ఎలా ఉన్నారంటూ ఆరా తీసింది. బంధాలు-అనుబంధాల విలువని తెలియజేసే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.