కేరళ జలవిలయానికి ఇవి కారణం కాదా..?

causes of heavy floods in kerala

దేశమంతా చేయూతనివ్వడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..
ఇంతటి విలయానికి, ఇంతటి ఘోర విపత్తుకు కారణమేంటి..?

మితిమీరిన ఇసుక తవ్వకాలు, అడవుల నరికివేత, పెరుగుతున్న పట్టణీకరణ… జలవిలయానికి ఇవి కారణం కాదా..?మానవ తప్పిదాలు కొంత కారణమైనా.. అసలు విషయాన్ని నాసా బయటపెట్టింది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా కురిసిన వర్షాలతోనే కేరళ అతలాకుతలమైందని నాసా తేల్చింది. దేశ వ్యాప్తంగా వర్షపాతాన్ని లెక్కిస్తూ ఉపగ్రహాన్ని ఉపయోగించి తీసిన వీడియోను విడుదల చేసింది.

ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 20 వరకు భారత్‌లో కురిసిన వర్షపాతాన్ని నాసా రెండు భాగాలుగా విభజించింది. మొదటి భాగంలో ఉత్తర భారత దేశంలోని సరిహద్దుల మీదుగా సుమారు ఐదు అంగుళాల మేర వర్షపాతం నమోదైంది.. ఇక రెండో భాగంలో పశ్చిమాన ఉన్న తూర్పు బంగాళాఖాతం వెంబడి 14 అంగుళాల మేర వర్షపాతం నోదైంది. మొదటి భాగం సాధారణ వర్షపాతం కాగా.. రెండోది ఎన్నడూ లేని విధంగా అల్పపీడనం ఏర్పడటం వల్ల నమోదైనట్లు తెలిపింది. దీని తీవ్రత తీర ప్రాంతమైన కేరళపై పడినట్లు నాసా తెలిపింది.

నిజానికి భారత వాతావరణ విశ్లేషకులు, ఐఎండీ కూడా ఈ విషయాన్ని ముందే చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, తుపాను పరిస్థితులకు తోడు రుతుపవనాల తీవ్రత కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు ఒకటి నుంచి 19 తేదీల మధ్య సాధారణం కంటే 164 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని, ఇదే ఇంతటి విలయానికి కారణమైందని విశ్లేషకులు చెప్పారు. మొత్తంగా ఆగస్టు నెలలో కేరళలో రెండున్నర రెట్లు వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.

రుతుపవనాలు, తుపాను పరిస్థితులతోపాటు సోమాలీ జెట్‌ దృగ్విషయం కూడా కేరళలో వర్షపాతానికి కారణమైందని విశ్లేషకులు చెప్పారు. మడగాస్కర్‌ ప్రాంతంలో ప్రారంభమై పశ్చిమ కనులమ వైపు వేగంగా వీచే గాలులనే సోమాలీ జెట్‌ పవనాలుగా పేర్కొంటారు. కేరళలో రుతుపవనాలు క్రియాశీలంగా ఉండగా.. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా కేరళలో కుండపోత వర్షాలు కురిశాయి. ఆగస్టు 7, 13 తేదీల్లో ఒడిశా తీరం దగ్గరల్లో ఏర్పడిన రెండు అల్పపీడనాల వల్ల అరేబియా సముద్ర తూర్పు ప్రాంత మేఘావృత గాలులు పశ్చిమ కనుమలవైపు వచ్చి కేరళ వ్యాప్తంగా అధిక వర్షాలకు కారణమయ్యాయి. ఇంతటి విలయాన్ని సృష్టించినట్లు వాతావరణ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. తాజాగా నాసా విడుదల చేసిన నివేదికలోనూ ఇదే విషయాన్ని పేర్కొంది.