ఆ భావన ప్రజల్లో రావాలి : టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు

cm chandrababunaidu meets with party seniour leaders

ప్రభుత్వ సేవలు, పార్టీ సేవల్లో నాణ్యత పెరిగిందనే భావన ప్రజల్లో రావాలన్నారు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు… వ్యవస్థలో ఒకరుగా ఏదీ చేయలేరని… బృందంగా పనిచేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయన్నారు… ప్రభుత్వ యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయడం వల్లే 511 అవార్డులు వచ్చాయన్నారు… అమరావతిలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు పార్టీలో కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని సూచించారు… నేతలు, కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని చంద్రబాబు తెలిపారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా మంత్రి, ఇన్‌ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు సమన్వయంతో పనిచేయాలని పార్టీ ముఖ్య నేతలకు చంద్రబాబు సూచించారు. త్వరలో బూత్ కమిటీ కన్వీనర్లు, సేవామిత్రలు, నేతలతో సమావేశం ఉంటుందని తెలిపారు. రాబోయే 150 రోజులకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఈనెల చివరి వారంలో రెండు భారీ కార్యక్రమాలు పెట్టుకున్నామని 25న కర్నూలులో ధర్మపోరాట సభ, 28న గుంటూరులో మైనారిటీ సభలను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

మరోవైపు అమరావతికి వచ్చిన గవర్నర్ నరసింహన్‌తో సీఎం భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరపాటు ఇద్దరి మధ్యా చర్చలు సాగాయి… మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిశానని రాష్ట్ర అభివృద్ధిపై బ్రీఫింగ్‌ ఇచ్చినట్టు సీఎం తెలిపారు… వరదలు, రాయలసీమ కరువుపైనా చర్చించామని… రాష్ట్ర అవసరాలను గుర్తించి కేంద్రం నుంచి సహాయం అందేలా చూడాలని కోరానన్నారు… అలాగే మంత్రివర్గ విస్తరణ అంశం తమ భేటీలో ప్రస్తావనకు రాలేదన్నారు..గవర్నర్‌ భేటీలో మంత్రివర్గ విస్తరణపై ఓ క్లారిటీ వస్తుందనుకున్న ఆశావహులకు మరోసారి చుక్కెదురైంది.