కొబ్బరినూనె విషతుల్యమైనది…హార్వర్డ్ ప్రొఫెసర్ హెచ్చరిక

కొబ్బరి నూనె విషతుల్యమైన ఆహారం అని హార్వర్డ్ TH చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ప్రొఫెసర్ కరీన్ మిచెల్ మిషెల్స్ హెచ్చరిస్తున్నారు.యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీబర్గ్‌లో ఇటీవల ఆమె “కోకోనట్ ఆయిల్ అండ్ నేచురల్ ఎర్రర్స్” అనే శీర్షికపై ప్రసంగం చేశారు. కొబ్బరి నూనె లో ఉండే సంతృప్త కొవ్వు ఆమ్లాలు శరీరానికి హానికరం చేస్తాయని పేర్కొన్నారు. దానిలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్డీఎల్ పరిమాణాన్ని పెంచుతుందని ప్రొఫెసర్ మిషెల్ తెలిపారు. సాంద్రమైన కొవ్వు వల్ల రక్తంలో ఎల్డీఎల్ పెరిగి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తమ పరిశోధనలలో వెల్లడైనట్లు చెప్పారు. కొబ్బరినూనె రుచిని ఇష్టపడేవారు కావాలంటే అతితక్కువ మోతాదులోనే వాడాలని ప్రొఫెసర్ మిషెల్స్ స్పష్టం చేశారు.

కొబ్బరి నూనె వివిధ వంటకాలలో ఉపయోగించడం సర్వసాధారణం. ఈ నూనెను ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తున్న తరుణంలో ప్రొఫెసర్ కరీన్ మిషెల్స్ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జరిపిన పరిశోధనలలో కొబ్బరినూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు కార్డియోవాస్క్యులర్ వ్యాధిని నియంత్రించడంలో తోడ్పడుతాయని తెలిపారు. ఈ సమయంలో ప్రొ మిషెల్స్ ప్రకటన కొంత గందరగోళాన్ని సృష్టిస్తోంది.

ముఖ్యంగా భారతీయులలో కొబ్బరినూనెకు అమితమైన ప్రాధాన్యత ఉంది. దీనిని ఆరోగ్యప్రదాయినిగా ప్రోత్సహిస్తున్నారు కేరళ రాష్ట్రంలో దీని వాడకం మరీ ఎక్కువ. వివిధ వంటకాలలో,వైద్య,సాంప్రదాయ వ్యవహరంలో కొబ్బరినూనెను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. కేరళ వాసులు దీన్ని సర్వరోగనివారిణిగా భావిస్తుంటారు. అయితే కొబ్బరినూనె శుద్ధవిషమని హార్వర్డ్ ప్రొఫెసర్ కారిన్ మిషెల్స్ హెచ్చరించిన నేపథ్యంలోవారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.