వర్షాలు లేకున్నా వరద ఉద్ధృతి.. నీట మునిగిన పంటలు

heavy rain both godhavari districs

ఎగువన కురుస్తున్న వర్షాలు దిగువన ఉభయ గోదావరి జిల్లాను ముంచెత్తాయి. వర్షాలు లేకున్నా వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో పంటలు నీట మునిగాయి. ఇళ్లు కూలిపోయాయి. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు.. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఏరియల్‌ సర్వే అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లాలోని 45 గ్రామాలకు వరద తాకిడి ఎక్కువగా ఉందని.. బాధితుల కోసం 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. వరదలతో ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 600 కోట్ల ఆస్తినష్టం జరిగిందని అంచనాకొచ్చారు. తూర్పు గోదావరిలో 6,600 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 19 వేల ఎకరాల పంట పూర్తి నాశనమైపోయింది. పంట నష్టపోయిన రైతులకు హెక్టారు 25 వేల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. అలాగే దెబ్బతిన్న ఇంటి నిర్మాణానికి లక్ష యాభై వేల పరిహారం ప్రకటించింది. ఎర్ర కాలువతో నష్టం ఎక్కువ జరిగిందన్న బాబు..ఎర్రకాలువ ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.

ఇక వచ్చే ఏడాది మే నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.. పోలవరం నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం 2,600 కోట్ల నిధులను నిలిపివేసినా.. ప్రాజెక్టు పనులు ఆగకుండా జాగ్రత్తపడ్డామని గుర్తుచేశారు.రాష్ట్రంలో ప్రాజెక్టులకు ప్రధాన్యం ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి.. 15 కొత్త ప్రాజెక్టులు ప్రారంభం అవుతున్న విషయాన్ని గుర్తు చేశారు.