జమ్ముకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన అల్లరిమూకలు.. భద్రతా దళాలపై రాళ్లు రువ్వి..

Jammu and Kashmir again attacks pakisthan

జమ్ముకశ్మీర్‌లో మరోసారి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. బక్రీద్‌ పర్వదినం వేళ కల్లోలం సృష్టించాయి. తెల్లవారుజామున ప్రార్థనల తర్వాత రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు.. భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. పాకిస్థాన్ జెండాలు, ఐసిస్ జెండాలు ప్రదర్శిస్తూ.. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని కంట్రోల్ చేసేందుకు జవాన్లు టియర్ గ్యాస్ ప్రయోగించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దాదాపు గంటపాటు ఉగ్రవాదులకు అనుకూలంగా ర్యాలీలు జరిగాయి. అదనపు బలగాల రాకతో అంతా చెల్లాచెదురైపోయారు.

అటు అనంత్‌ నాగ్‌లోనూ అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా రాళ్లదాడికి పాల్పడ్డాయి. పోలీస్‌ పెట్రోలింగ్ వెహికిల్‌పై దాడికి యత్నించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇక… శ్రీనగర్‌లోని హజ్‌రత్‌ బల్‌ దర్గాలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లాకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఇటీవల వాజ్‌పేయి సంస్మరణ సభలో భారత్‌ మాతాకీ జై.. జై హింద్‌ అంటూ ఫరూఖ్‌ నినాదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రార్థనలు ముగిసిన వెంటనే నినాదాలు అందుకున్న నిరసనకారులు… కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలంటూ ఆందోళన చేశారు.

ఈ నిరసనలపై ఫరూఖ్‌ అబ్దుల్లా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇలాంటి పిచ్చిపిచ్చి ఆందోళనకు బెదిరేది లేదని తేల్చిచెప్పారు. కాశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమేనని.. ఈ దేశ పౌరులుగానే పుట్టిన కశ్మీరీలు.. ఈ దేశ పౌరులుగానే మట్టిలో కలిసిపోతారంటూ ఉద్వేగంగా సమాధానమిచ్చారు.

మరోవైపు సౌత్ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఓ ట్రైనీ కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు. బక్రీద్ పార్థనల తర్వాత తిరిగి వెళ్తున్న ఫయాజ్ అహ్మద్‌పై ఫైరింగ్ చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. జాజిపొరాలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. అటు, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్న కారణంతో స్థానిక నేత షాబీర్ అహ్మద్ భట్‌ను కూడా టెర్రరిస్ట్‌లు కాల్చి చంపారు. బక్రీద్ అంటే త్యాగానికి ప్రతిరూపంగా చెప్తారు. ముస్లింలంతా దీన్ని చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇలాంటి సందర్భంలో వరుస ఘటనలతో కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -