ఆ జిల్లాలో టీడీపీకి వర్గపోరు.. కాయకల్ప చికిత్స చేసి..

andhrapradesh political partys statergy

కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఒక్క రాజంపేట అసెంబ్లీ స్థానం మినహా అన్ని చోట్లా TDP ఓటమి చవిచూసింది. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం కనిపించినా.. తర్వాత వర్గపోరుతో తమ్ముళ్ల సంతోషం ఆవిరైపోతోంది. జిల్లా కేంద్రమైన కడప నియోజకవర్గాన్ని నాయకత్వలేమి వెంటాడుతోంది. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డినే ఇన్ చార్జిగా పార్టీ నియమించింది. అయితే ఈయన సొంత నియోజకవర్గం కాకపోవడం, ముస్లిం మైనార్టీల ఓట్లు అధికంగా ఉండటంతో ఆయన సమన్వయం సాధించలేకపోతున్నారు. ఇక్కడ నుంచి పోటీకి నేతలు ఉత్సాహం చూపుతున్నారు కానీ.. ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకురావడం లేదు. అటు కమలాపురంలోనూ బహునాయకత్వంతో పార్టీ క్యాడర్ సతమతమవుతోంది. పార్టీ ఇన్ ఛార్జీగా మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో టికెట్ తనకేనన్న ధీమాలో ఉన్నారు. అయితే ఇక్కడ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. పుత్తాకే వచ్చే ఎన్నికల్లో టికెట్ అంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రకటిస్తే…. సిఎం రమేష్ ఆశీస్సులతో తనకే టికెట్ అంటూ వీరశివారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రొద్దుటూరులోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డి అండదండలతో టికెట్ తనదేనని చెబుతుంటే, మరోవైపు ఎంపి సిఎం రమేష్ వర్గీయుడుగా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి టికెట్ తనదేనంటూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ టికెట్ గొడవలు ఇటీవల కాలంలో తారాస్థాయికి చేరాయి. బహిరంగంగా మీడియా ఎదుట ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటు పార్టీని రోడ్డుకీడ్చుతున్నారు.

మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగులోను ఇదే పరిస్ధితి. మంత్రి ఆది టికెట్ తనకేనని, నాలుగోసారీ గెలుస్తానని ప్రకటించుకుంటే.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాత్రం టికెట్ తనకేనని చెబుతున్నారు. దీంతో ఎన్నికల్లో టికెట్ ఎవరికోనంటూ పార్టీలో గందరగోళ పరిస్ధితి నెలకొంది. బద్వేలు నియోజకవర్గంలోను మూడు ముక్కలాటగా మారింది. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, వైసీపీ తరుపున గెలిచి టిడిపిలో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే జయరాములు, గత ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీచేసి ఓడిపోయిన విజయజ్యోతిల మధ్య ఒకరిలో ఒకరికి సఖ్యత లేదు. ప్రతి నిత్యం ఒకరపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం, దిష్టిబొమ్మలు దగ్దం చేసుకోవడంతో పార్టీ క్యాడర్ తికమకపడుతోంది. రైల్వేకోడూరులో పార్టీకి పట్టున్నా ప్రస్తుత ఇన్ ఛార్జి కస్తూరీ విశ్వనాధనాయుడు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు వర్గాలు అన్ని విషయాల్లోను పోటీపడుతూ పార్టీని బజారుకీడుస్తున్నాయి. రాయచోటిలోను మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు వర్గాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లుగా అధిపత్యం కోసం రాజకీయాలు నడిపితే ఎన్నికలు దగ్గరపడటంతో టికెట్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో ఇక్కడున్న కార్యకర్తలు ఎవరి వెంట వెళ్లాలో అర్ధం కానీ పరిస్ధితి. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఇటీవల కాలంలో కొంత చురుకైన పాత్ర పోషించినా.. ఎన్నికలు దగ్గర పడితే మాజీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ బిటెక్ రవి, మరో నాయకుడు రాంగోపాల్ రెడ్డిల మధ్య పోటీ తలెత్తే అవకాశాలున్నాయి. జిల్లాలో నాయకత్వ, వర్గపోరు సమస్య లేని నియోజకవర్గం ఎదైనా ఉందంటే అది ఒక్క మైదుకూరు నియోజకవర్గమనే చెప్పాలి. ఇక్కడ ప్రస్తుత టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఒక్కరిదే అధిపత్యం కొనసాగుతొంది.

కడప వర్గపోరుకు చెక్ పెట్టడం, ఆర్ధిక ఇబ్బందులున్న వారి వ్యవహారం చక్కబెట్టి పార్టీని గాడిలో పెట్టడం, టికెట్ల వ్యవహారంపై కూడా పూర్తి క్లారిటి ఇవ్వడం వంటి అంశాలపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేస్తారన్న ప్రచారం సాగుతొంది. ఇటీవల దమ్ముంటే నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు విసిరిన సవాల్ నేపథ్యంలో ఈ పర్యటన అంతా సవ్యంగా సాగితే అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టుల ద్వారా సంతృప్తి పరిచే అవకశాలు కనిపిస్తున్నాయి. త్వరలో చంద్రబాబు కడప టూర్‌తో పార్టీలో వర్గపోరుకు కాయకల్ప చికిత్స చేసి పార్టీని ఎన్నికలకు సిద్దం చేసే లక్ష్యంతో చంద్రబాబు వస్తున్నారన్న నమ్మకాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -