
పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్‌మోడీకి మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో దాక్కున్న నీరవ్ మోడీ, అతడి మామ మెహుల్ చోక్సీల పేరుతో ఉన్న అక్రమ బంగ్లాలను కూల్చివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాయ్‌గఢ్ జిల్లాలో అక్రమంగా నిర్మించిన వారి భవనాలను ధ్వంసం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని ఇటీవల బాంబే హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది.
నీరవ్, ఛోక్సీల బంగ్లాలను… పీఎన్బీ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. దీంతో ఈ అక్రమ నిర్మాణాలను పడగొట్టడానికి తమకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి లేఖ రాసినట్లు అధికారులు వెల్లడించారు. ఈడీ అనుమతి వచ్చిన తర్వాత వారి బంగ్లాలను కూలగొడతామని చెప్పారు. రాయ్‌గఢ్‌లోని అలీబాగ్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన 121 బంగ్లాలను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో నీరవ్, మెహుల్ ఛోక్సీల బంగ్లాలతో పాటు పలువురు సెలబ్రిటీల భవనాలు ఉన్నాయని చెప్పారు. నీరవ్ బంగ్లా కిహిమ్ గ్రామంలో ఉండగా…ఛోక్సీ బంగ్లా అవాస్ గ్రామంలో ఉందని వెల్లడించారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి ఈ భవనాల నిర్మాణం జరిగిందన్నారు. అయితే కొన్ని బంగ్లాలను కూలగొట్టకుండా యజమానులు న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు పొందడంతో… ఈ కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు బదిలీ చేశామన్నారు. మరో రెండు మూడునెలల్లో వీటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.