ఓ పోలీస్ ఆఫీసర్.. అనాథకు అమ్మగా.. చనుబాలను ప్రేమగా..

పేగు తెంచుకుపుట్టిన బిడ్డకు మాత్రమే తల్లిని అని అనుకోలేదు. ఆకలితో గుక్క పట్టి ఏడుస్తున్న అనాథ బిడ్డకు కూడా ఆ క్షణం తల్లైంది. అమ్మ పాశాన్ని అందించింది. ఆర్తిగా ఆ బిడ్డ పాలు తాగుతుంటే తల్లి కాని ఆ తల్లి హృదయం ఉప్పొంగింది. మనసు ఓ మంచి పనిచేస్తున్నావమ్మా అంటూ తల్లి ప్రేమను ప్రోత్సహించింది. అర్జెంటీనాలోని బెర్రిసో నగరానికి చెందిన సెలస్టే జాక్వెలిన్ అనే మహిళ పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

పోలీస్ ఉద్యోగమంటేనే కత్తిమీద సాము లాంటిది. కష్టమైన బాధ్యతలు చేపట్టాలి. పాపం అనే పదానికి చోటివ్వకుండా ఒక్కోసారి కఠినంగా వ్యవహరించాలి. కానీ ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా నేనూ ఓ అమ్మ కన్న బిడ్డనే. నేనూ ఓ బిడ్డకు తల్లినే అని అనిపించుకుంది జాక్వెలిన్. ఇటీవలే తను కూడా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పాలు పట్టి డ్యూటీకి బయలు దేరింది. పసివాడ్ని జాగ్రత్తగా చూసుకోమంటూ పనివాళ్లకు అప్పగించి అమ్మపాత్రను ఇంట్లో వదిలేసి పోలీస్ ఆఫీసర్‌గా మారిపోయింది. విధి నిర్వహణలో భాగంగా ఓ ఆసుపత్రికి గస్తీ కాయడానికి వెళ్లింది. డ్యూటీ చేస్తుండగా ఓ పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆరా తీస్తే అనాథ బిడ్డ అని తెలిసింది. అప్పటికే నర్స్‌‌లు ఆ బిడ్డను సముదాయిస్తున్నారు. అయినా బిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది. దాంతో జాక్వెలిన్ మనసు తల్లడిల్లింది. నర్స్ చేతిలో ఉన్న బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది. అమ్మతనాన్ని అందించింది. బిడ్డకు పాలిచ్చింది.

డ్యూటీలో ఉన్నాననే విషయాన్ని ఆ కాసేపు పక్కన పెట్టి తానే బిడ్డకు తల్లైంది. ఆప్యాయతను, అనురాగాన్ని పంచి బిడ్డ ఆకలిని తీర్చింది. ఆ దృశ్యాన్ని చూసిన తోటి పోలీస్ మహిళా కానిస్టేబుల్స్, హాస్పిటల్‌లోని నర్స్‌లు అమ్మ ప్రేమకు సలాం చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచం మొత్తం అనాథ బిడ్డ పట్ల జాక్వెలిన్ చూపించిన ప్రేమకు ఫిదా అయ్యింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -