అత్యధిక మొత్తంలో సంపాదిస్తున్న వారి లిస్ట్‌లో పీవీ సింధు

తెలుగు తేజం పీవీ సింధు ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తున్న మహిళా క్రీడాకారిణుల లిస్ట్‌లో ఏడో స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి టాప్‌-10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణి సింధునే.

అమెరికా టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా మూడో ఏడాది టాప్‌ప్లేస్‌లో నిలిచి రికార్డ్‌ సృష్టించింది. సెరెనా ఏడాది సంపాదన 121 కోట్లు కాగా.. సింధు 60 కోట్లు సంపాదిస్తోంది. ఇందులో ప్రైజ్‌మనీ ద్వారా మూడున్నర కోట్లు, వాణిజ్య ప్రకటనల ద్వారా 57 కోట్లు సంపాదించింది. 23 ఏళ్ల సింధు.. బ్రిడ్జ్‌స్టోన్‌, గెటరోడ్‌, నోకియా, పానసోనిక్‌ తదితర బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. సింధు ఈ ఏడాది ఒక్క ఫైన‌ల్ కూడా గెల‌వ‌లేక‌పోయినా.. ప్రతి టోర్నీలోనూ నిల‌క‌డగా రాణిస్తోంది.

గతేడాది సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ ఏడాది మార్చిలో సెరెనా మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టింది. టోర్నీల్లో గెలవడం ద్వారా ఆమె కేవలం 62 వేల డాలర్లు మాత్రమే సంపాదించినా.. ఎండార్స్‌మెంట్ల ద్వారా 1.81 కోట్ల డాలర్లు ఆర్జించడం విశేషం. ఈ విషయంలో ఏ మహిళా ప్లేయర్‌కు కూడా అందనంత ఎత్తులో సెరెనా ఉంది. సెరెనా తన కెరీర్‌లో టెన్నిస్ కోర్టులో సంపాదించిన దాని కంటే రెట్టింపు బయట సంపాదించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో సెరెనా సోదరి వీనస్ ఆరో స్థానంలో.. రష్యా ప్లేయర్‌ మరియా షరపోవా ఐదో స్థానంలో నిలిచింది. టోర్నీలు ఆడటం ద్వారా అందుకునే ప్రైజ్‌మనీతో పాటు వాణిజ్య ఒప్పందాల ద్వారా వీరు అందుకుంటున్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ఫోర్బ్స్‌ ఈ జాబితాను తయారు చేసింది. ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా టెన్నిస్ ప్లేయర్లే. ఆ ఇద్దరిలో సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ కాగా.. మరో క్రీడాకారిణి డానిక పాట్రిక్‌ రేస్‌ కార్‌ డ్రైవర్‌.