వరలక్ష్మీ వ్రతం.. ఎంతో శుభప్రదం

శ్రావణమాసం.. మాసాల్లోకే విశిష్టమైనది. ఈ నెల రోజులు ప్రతి ఇల్లూ దేవాలయాన్ని తలపిస్తుంది. ఆడపడుచులు సకల సౌభాగ్యాలను ప్రసాదించమని భక్తితో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. లోగిళ్లను అందమైన ముగ్గులతో అలంకరిస్తారు. భక్తి శ్రద్ధలతో దేవాలయాలను సందర్శిస్తుంటారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందువుల ఆచారం. అష్టైశ్వర్యాలను ప్రసాదించే అష్టలక్ష్మీ రూపాన్నే వరలక్ష్మీ దేవిగా భక్తులు కొలుస్తారు. శ్రీహరికి ఇష్టమైన, పైగా జన్మనక్షత్రం కూడా అయిన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశిష్ట ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

వరలక్ష్మీ వ్రతం రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానపానాదులు ముగించుకుని కొత్తబట్టలు ధరించి పూజకు సిద్ధమవ్వాలి. కలశం మీద కొబ్బరికాయను ఉంచి అమ్మవారి రూపంలో పసుపు కుంకుమలతో తీర్చి దిద్దాలి. అమ్మవారిని చీరహారలతో అలంకరించాలి. ధూప, దీప, నైవేథ్యాలతో వరలక్ష్మీ వ్రత కథను చదివి భక్తితో అమ్మవారిని ధ్యానించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమ నిష్టలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత్త చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో శుభప్రదమైనది. ఈ వ్రతాన్ని చేయడం వలన లక్ష్మీదేవి కృపకు పాత్రులవుతారు. కేవలం ఒక్క నగదు రూపంలో వచ్చేదే సంపద కాదు, జ్ఞాన సంపద, గుణ సంపద కూడా ఎంతో విశిష్టమైనవి. వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా వస్తుంది.