అయ్యన్నvs గంటా..గొయ్యితీసి పాతరేస్తానంటూ..

మంత్రులు అయ్యన్న, గంటా శ్రీనివాసరావు మధ్య మరోసారి అగ్గిరాజుకుంది. తోటి కేబినెట్ మంత్రులపైనే ఓ రేంజ్ లో పైరయ్యారు మంత్రి అయ్యన్న. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న స్థలమే మంత్రుల మధ్య వార్ కు కారణమైంది. బస్ కాంప్లెక్స్ ఖాళీ స్థలంలో మల్టీ కాంప్లెక్స్ నిర్మాణానికి బీఓటీ పద్దతిలో లీజుకు తీసుకున్నారు గంటా. ప్రత్యూష కన్స్ ట్రక్షన్ పేరుతో మల్టీ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారు. కానీ, స్థానిక మంత్రి అయ్యన్న దాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. దీంతో నిర్మాణం ప్రారంభం వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే..బుధవారం రాత్రి అదే సైట్ లో పనులు ప్రారంభం కావటంతో మంత్రుల మధ్య వార్ రచ్చకెక్కింది.

నర్సీపట్నం బస్టాండ్ స్థలంలో మల్టీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. విషయం తెల్సుకున్న మంత్రి అయ్యన్న అధికారులకు ఫోన్ చేసి వెంటనే పనులను నిలిపివేయాలని హెచ్చరించారు. ఆ వెంటనే కార్యకర్తలను వెంటబెట్టుకొని పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడితే గొయ్యి తీసి పాతేస్తా అంటూ అధికారులను హెచ్చరించారు. నిర్మాణం చేపట్టేందుకు ఎవరు వచ్చినా అడ్డంగా నరికేస్తానంటూ అవేశంతో ఊగిపోయారు. అవసరమైతే మంత్రి పదవిని వదులుకుంటానని అన్నారు. బస్టాండ్ స్థలంలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దంటూ అటు రవాణా శాఖ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నానని అన్నారాయన.

-ADVT-