వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రాధాన్యం ఏంటో తెలుసా..?

Do you know the value of Varlakshmi vratham

శ్రావణమాసం రెండో శుక్రవారం రోజున ఆచరించే వరలక్ష్మి వ్రతానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృపకు పాత్రులై ఐశ్వర్యంతో పాటు సకల శుభాలు కలుగుతాయని, మహిళలకు దీర్ఘకాల సుమంగళి భాగ్యం దక్కేలా దేవతలు పూజిస్తారని పండితులు చెబుతారు. ఈ వ్రతాచరణ గురించి శివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు స్కంద పురాణం, భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి. వ్రతం ఆచరించడం వల్లే పార్వతీదేవికి కుమారస్వామి జన్మించాడని చెబుతారు. శ్రావణమాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు.

చాంద్రమాసం ప్రకారం సంవత్సరంలో ఐదవ మాసం శ్రావణమాసం. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రానికి చేరువలో ఉండటం వల్ల శ్రావణమాసం అనే పేరొచ్చింది. విష్ణుమూర్తి జన్మ నక్షత్రం కూడా శ్రవణా నక్షత్రం కావడంతో శ్రావణమాసం ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు. శుభ కార్యాలకు ఈ మాసం చాలా అనువైనది. అందుకే శ్రావణమాసానికి శుభ మాసమనే పేరు ఉంది. ఈనెలలో నోములు, వ్రతాలు, పండుగలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలు కొత్తశోభతో వెలిగిపోతున్నాయి.. సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరగనున్నాయి. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరగనున్నాయి.