కారులో కార్బన్ మోనాక్సైడ్ బాల్ ఉంచి భార్యని, కూతుర్ని..

మానవత్వం మరిచిపోతున్నారు.. మనిషి మనిషిగా ప్రవర్తించడం మానేస్తున్నాడు.. మంచి చెడు విచక్షణను కోల్పోయి క్రూర మృగాల్లా ప్రవర్తిస్తున్నారు.. కట్టుకున్న వారిని, కన్నబిడ్డలను హత మారుస్తున్నారు.. హాయిగా సాగుతున్న సంసారంలో అనుకోకుండా వచ్చిన ప్రియుడు లేదా ప్రియురాలి కోసం ఏం చేయడానికైనా వెనుకాడ్డం లేదు. హాంకాంగ్‌లోని చైనా విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్‌గా, డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కిమ్ సన్‌కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కిమ్ కామ్‌గా ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో భర్తని నిలదీసింది. దాంతో కిమ్ భార్యకు విడాకులు ఇచ్చేద్దామనుకున్నాడు.

కానీ భార్య విడాకులకు ఒప్పుకోలేదు. తన తెలివైన బుర్రకి పని చెప్పాడు.. పక్కా ప్లాన్ వేశాడు. భార్యని, పెద్ద కూతురిని చంపాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఎక్సర్‌సైజ్‌ల కోసం వాడే బాల్‌ని తీసుకుని అందులో కార్బన్ మోనాక్సైడ్ వాయువుని నింపాడు. చిన్న కూతురిని ఇంట్లో ఉండమన్నాడు. భార్యని పెద్ద కూతురిని కారులో కూర్చోమన్నాడు. వారిద్దరూ కారులో కూర్చున్నాక ముందుగానే అందులో ఉంచిన కార్బన్ మోనాక్సైడ్ బాల్‌ని లీక్ చేసి డోర్ లాక్ చేశాడు. కార్బన్ వాయువుని పీల్చిన ఇద్దరూ కారులోనే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కిమ్‌ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విడాకులు ఇవ్వని కారణంగానే భార్యని, ప్రశ్నించినందుకు కూతురిని చంపేశానన్నాడు కిమ్. దోషిగా పరిగణించిన హాంకాంగ్ కోర్టు అతడికి కఠినమైన శిక్షను విధించనుంది.