కోకాకోలా, డొమినోస్‌ కటీఫ్‌..!

coca cola, dominas

గత ఇరవై సంవత్సరాలుగా ఉన్న వ్యాపార అనుబంధాన్ని తెంచుకుంటున్నట్టు డొమినోస్‌, కోకా కోలా ఇండియా ప్రకటించాయి. దీంతో రెండు దశాబ్దాలుగా ఉన్న ప్రత్యేకమైన ఒప్పందం ముగిసినట్లయింది. వ్యయ నియంత్రణలో భాగంగా మరో బేవరేజ్‌ సంస్థ పెప్సీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి చురుకుగా చర్చలు జరుపుతున్నట్టు డొమినోస్‌ వెల్లడించింది. ప్రత్యర్థి కంపెనీలైన పిజ్జా హట్‌, కేఎఫ్‌సీ, టాకో బెల్‌లతో కలిసి కోకాకోలా పనిచేస్తుండటం విశేషం.

ప్రస్తుతం డొమినోస్‌ను జుబిలెంట్ ఫుడ్‌ వర్క్స్‌ నిర్వహిస్తోంది. తాజా అప్‌డేట్‌ను జుబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ (జేఎఫ్‌ఎల్‌) అధికార ప్రతినిధి ధృవీకరించారు. “గత 20 సంవత్సరాల్లో కోకా-కోలా ఇండియాతో మేము బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము తరువాతి దశ అభివృద్ధి కోసం మా వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. వివిధ సంస్థలను పరిశీలించి శీతల పానియాల భాగస్వామని ఎంపిక చేసుకోవడానికి, మా పానియాల పోర్ట్‌ఫోలియోను పెంచడానికి సహాయపడే సంస్థను గుర్తించేందుకు ఒక విధానాన్ని ప్రారంభించాం” అని జుబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ వెల్లడించింది.

వ్యయాలను గణనీయంగా తగ్గించి మెరుగైన లాభాలను ఆర్జించడానికి డొమినోస్‌ కసరత్తు ప్రారంభించింది. గత త్రైమాసికంలో డొమినోస్‌ లాభం మూడురెట్లు పెరిగింది. ప్రస్తుతం డొమినోస్‌కు దేశవ్యాప్తంగా 1,144 స్టోర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ దేశాల్లో వ్యాపారం కోసం కోకాకోలాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, మలేషియాల్లో పెప్పికోతో కలిసి డొమినోస్‌ పనిచేస్తోంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -