మూడు ద‌శ‌ల్లో మ‌ల్ల‌న్నసాగ‌ర్‌కు గోదావరి జలాలు

మిడ్ మానేరు నుంచి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ కు నీటిని త‌ర‌లించే ప‌నులు వేగంగా కొన‌సాగుతున్నాయి. పంప్ హౌజ్ లు , టన్నెల్స్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. రిజ‌ర్వాయ‌ర్ ప‌నులు చేప‌డుతున్నారు. రిజ‌ర్వాయ‌ర్ పూర్తికాక‌పోయినా అప్రోచ్ కెనాల్స్ తో నీరందించేందుకు ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది.

గోదావ‌రి నీటిని మిడ్ మానేరు నుంచి కొమరెల్లి మ‌ల్ల‌న్నసాగ‌ర్ కు మూడు ద‌శ‌ల్లో త‌ర‌లిస్తారు. గ‌తంలో ప్రాణ‌హిత చేవెళ్ళ ప్రాజెక్టులో చేప‌ట్టిన ప‌నుల‌ను ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. ప‌దో ప్యాకేజీలో భాగంగా మిడ్ మానేరు నుండి అనంత‌గిరికి నీటిని త‌ర‌లిస్తారు. దీనికోసం టన్నెల్స్, సర్జ్ పూల్ ప‌నులు దాదాపు పూర్త‌య్యాయి. పంప్ హౌజ్ నిర్మాణం ప‌నులు సైతం జ‌రుగుతున్నాయి. ప‌ద‌కొండో ప్యాకేజీలో అనంతగిరి రిజ‌ర్వాయ‌ర్ నుండి రంగ‌నాయ‌క సాగ‌ర్ కు నీటిని త‌ర‌లిస్తారు. ట‌న్నెల్ , అప్రోచ్ , గ్రావిటీ కెనాల్ ప‌నులు దాదాపు పూర్త‌య్యాయి. రిజ‌ర్వాయ‌ర్ ప‌నులు కొన‌సాగుతున్నాయి.

రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి 12వ ప్యాకేజీ ద్వారా గోదావ‌రి నీటిని కొమ‌రెల్లి మ‌ల్ల‌న్న సాగ‌ర్ కు త‌ర‌లిస్తారు. ఇక్క‌డ ట‌న్నెల్ , పంప్ హౌజ్ , స‌ర్జ్ పూల్ ప‌నులు దాదాపు పూర్త‌య్యాయి. ఇక్క‌డ భూ గ‌ర్భంలో పంప్ హౌజ్ తో పాటు సర్జ్ పూల్ ను నిర్మిస్తున్నారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప‌నులు కూడా ప్రారంభం కావాల్సి ఉంది. సెప్టెంబ‌ర్ చివ‌రి క‌ల్లా కొంత ఆయ‌క‌ట్టుకైనా నీరివ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది ప్ర‌భుత్వం.

మొత్తానికి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నులు 24 గంటల పాటు నిరంత‌రంగా సాగుతున్నాయి. బ్యారేజీలు, ఆన‌క‌ట్టలు‌, టన్నెల్స్ వ‌ద్ద రెండువేల మంది ప‌నిచేస్తున్నారు. ఒడిషా, చ‌త్తీస్ ఘ‌డ్, బిహార్, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ , ఢిల్లీ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారు ఈ ప్రాజెక్టు కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నారు.