ప్రస్తుత వర్షాలతో కొత్త ఆశలు

good news for farmers over heavy rain

ఖరీఫ్‌లోఆశించిన వర్షాలు లేక నిన్నటి వరకు సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు సన్నగిల్లాయి. కృష్ణానది నీరు అంతంతమాత్రంగా ప్రవహించడంతో రైతులు పూర్తి నిరాశలో కూరుకుపోయారు. ఇక ఈ యేడు పంటలు సాగవ్వవేమోనన్న నైరాశ్యంలోకి వెళ్లిన రైతన్నలకు ప్రస్తుత వర్షాలు కొత్త ఆశలు కల్పించాయి. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తడం ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టు రైతుల్లో ఆనందాన్ని నింపింది.

కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో.. 3లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతోంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులకు చేరింది. మరో వంద టీఎంసీలు వస్తే నాగార్జునసాగర్‌ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఇప్పటికే ఎగువ ప్రాజెక్టులన్నీ నిండడంతో వచ్చిన వరదలు వచ్చినట్టే.. సాగర్‌లోకి చేరుతున్నాయి. వరదలు ఇలాగే కొనసాగితే.. మరో 10 రోజుల్లో ప్రాజెక్టు నిండడం ఖాయంగా కన్పిస్తోంది. అదే జరిగితే దాదాపు తొమ్మిదేళ్ల తరువాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి.

నాగార్జునసాగర్ ఎడమ ఆయకట్టుకు నాలుగేళ్ల తరువాత వానాకాలం పంటలకు నీటని విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఎడమ కాలువలోని జోన్‌-1, జోన్-2కు సాగునీటిని విడుదల చేశారు. సాగర్ నీటిపై ఆధారపడి.. ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోనే మూడు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 17 మండలాల్లో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ విస్తరించి ఉంది. దీని పరిధిలో 2,51,800 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. రెండు జోన్ల పరిధిలోని ఆరు లక్షల 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు చర్యలు చేపట్టారు. ఆయకట్టు మొత్తానికి ఆరుతడుల్లో నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. గురువారం నుంచి నవంబర్ 20 వరకు 40 టీఎంసీల నీటిని సాగర్ నుంచి విడుదల చేయనున్నారు.

ఎడమ ఆయకట్టుకు నీరు విడుదల చేయడంతో.. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. గత వారం రోజల వరకు కాల్వలకు నీరు వస్తాయో, రావోనని సందిగ్ధంలో ఉన్న రైతులకు ఎట్టకేలకు నీరు విడుదల చేయడం ఊరట నిచ్చింది. ఆయకట్టు కింద బోర్లు, బావుల ఆధారంగా 25, 30 శాతం మంది రైతులు మాత్రమే ఇప్పటికి వరి నాట్లు వేశారు. నీరు విడుదలకై డిమాండ్ చేసిన రైతులు ఇప్పుడు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.