పాములతో ఉక్కిరి బిక్కిరి.. 250 మందికి పాముకాటు

huge snakes in avanigadda

ఒకవైపు వర్షాలు.. మరోవైపు పాము కాట్లతో కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంత వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పాము కాటు అంటే ఒకరో ఇద్దరు మాత్రమే కాదు వందల సంఖ్యలో పాము కాటు బారిన పడుతున్నారు. గత నాలుగు నెలల్లో 250 మంది పాముకాటుకు గురయ్యారు.

వరి నాట్లు వేయటానికి పొలాల్లోకి వెళ్లిన వారిని పగ పట్టినట్టుగా పాములు కాటేస్తున్నాయి. పొలాల్లో పెద్ద ఎత్తున ఎలుకలు ఉండటంతో వాటి కోసం పాములు మాటు వేస్తున్నాయి. పొలాల్లో నాట్ల కోసం దిగుతున్న రైతు కూలీలపై విరుచుకు పడుతున్నాయి. దొరికిన వాళ్లను దొరికినట్టు పాములు కాటేస్తుంటే.. చేతికి చిక్కిన పామునల్లా జనం చంపేస్తున్నారు. ఒక దాన్ని చంపితే మరోటి వస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి దివిసీమలో కనిపిస్తోంది. అవనిగడ్డ ఆస్పత్రి నిండా పాము కాటు బాధితులే కనిపిస్తున్నారు. వార్డులు, బెడ్లన్నీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి.

పొలాల్లో రైతుల కళ్ల ముందు జరుగుతున్న ఘటనలు గగుర్పొడిచేలా ఉన్నాయి. వరి నాట్లు వేసే సమయంలో పాములు చేతికి తగులుతున్నాయని, పట్టుకునేలోపే కాటేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. కొన్నిటిని విసిరేస్తున్నా, మరికొన్ని తీవ్రంగా విరుచుకుపడుతున్నాయని వాపోతున్నారు. ఇలా ఎన్నిరోజులో అర్థం కావడం లేదని బాధను వెళ్లబోసుకుంటున్నారు రైతులు.

ఇప్పటికే పాము కాటు కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పొగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అవనిగడ్డలోని విశ్వనాధపల్లికి చెందిన ఓ రైతు వారం రోజుల క్రితం పొలంలో పాము కాటుకు గురవ్వగా అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పొలాల్లోకి వెళుతుండగా గన్నవరంలో ఇద్దరు వ్యక్తులు పాము కాటుకు గురై ప్రాణాలు వదిలారు. అవనిగడ్డకు వచ్చిన కోడూరుకు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి పాము కాటుతో ఆస్పత్రిలో చేరాడు. అయితే అతని పరిస్థితి విషమయంగా ఉండటంతో మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న అవనిగడ్డలో మాత్రమే మెరుగైన వైద్యం, మందులు అందుతున్న పరిస్థితులు ఉండటంతో పాము కాటు బాధితులు అందరూ ఇక్కడకు చేరుకుంటున్నారు.

పొలాలలో కూలి పనులకు వెళ్లే వారు ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. మరోవైపు ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అన్ని పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై దృష్టిసారించి సమస్య పరిష్కరించాలని చెప్పినా క్షేత్రస్థాయిలో అది సాధ్యం అవటంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, ఆస్పత్రుల్లో పాముకాటుకు సంబంధించి మందులు అందుబాటులో ఉంచినట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ప్రధానంగా ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండటం, డాక్టర్లు ఉండటం ఈ సమస్యకు పరిష్కారం కాదనేది విశ్లేషకులు చెబుతున్న మాట. పొలాల్లో ఉంటున్న పాములను ముందస్తుగా అక్కడ నుంచి పంపించడమే అత్యంత ముఖ్యమైన విషయం. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవటంలేదని, రైతులకు అవగాహన కల్పించటంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పాములను బయటకు పంపడానికి పొలాల్లో విష గుళికలు వేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా రైతులకు అధికారులు అవగాహన కల్పించాలంటున్నారు.

రోజూ పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్న నేపథ్యంలో పొలాల్లోనే సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి అవసరం ఉంది. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా… ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా..? చూడాలి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -