ప్యాంట్ కోసం హత్యకు దారితీసిన అన్నదమ్ముల గొడవ..

చిన్న చిన్న గొడవలే చినికి చినికి గాలివానలవుతున్నాయి. ఒక్కోసారి హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. అలహాబాద్ బెహ్‌మాల్పుర్ గ్రామానికి చెందిన రాజేంద్ర, సురేంద్రలు అన్నదమ్ములు. సురేంద్ర రెండు జీన్స్ ప్యాంట్లు కొనుక్కుని ఇంటికి వచ్చాడు. నాకు ఒకటి కావాలంటూ రాజేంద్ర తమ్ముడు సురేంద్రను అడిగాడు. కానీ అన్నకు జీన్స్ ప్యాంట్ ఇవ్వడానికి తమ్ముడికి మనసొప్పలేదు. తను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నాడు. అందుకే ఇవ్వనన్నాడు.

దాంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన అన్న తమ్ముడిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డ సురేంద్రను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.