కనకం కూత పెట్టలేకపోయిన కబడ్డీ టీమ్

India miss out on gold for first time

భారత పురుషుల కబడ్డీ టీమ్ ఆసియా క్రీడల్లో ఈసారి కనకం దాకా కూత పెట్టలేకపోయింది. సెమీస్‌లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో భారత పురుషుల జట్టుకు ఇరాన్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. భారత్‌ 18–27తో పరాజయం చవిచూసింది. 1990 లో ఏషియాడ్‌లో తొలిసారి ఈ గ్రామీణ క్రీడను చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నాలుగేళ్లకోసారి ఎదురులేని భారత జట్టు స్వర్ణం సాధిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ విజయవంతమైన చరిత్రకు చుక్కెదురైంది. 28 ఏళ్ల స్వర్ణ భారతానికి కాంస్యమే దిక్కయింది. గత రెండు పర్యాయాలు ఫైనల్లో భారత్‌ చేతిలో ఎదురైన పరాజయానికి ఇరాన్‌ ఈసారి బదులు తీర్చుకుంది.

మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో సింధు ప్రపంచ 52వ ర్యాంకర్‌ వు థి ట్రాంగ్‌ పై గెలుపొందగా… సైనా నెహ్వాల్ ఇరాన్‌కు చెందిన సొరాయా అఘజియాఘా సునాయాసంగా నెగ్గింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 21–16, 21–15తో ఎన్జీ వుంగ్‌ –వైయుంగ్‌ లపై విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి, మనూ అత్రి–సుమీత్‌ రెడ్డి గెలిచారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మాత్రం సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా… సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప జోడీలు తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు.

షూటింగ్ విభాగంలో భారత ఖాతాలోకి మరో పతకం వచ్చింది. ఆసియా క్రీడల్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత యువ షూటర్లు మెరిపిస్తున్నారు. మొన్న 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో 16 ఏళ్ల సౌరభ్‌ చౌదరీ ఏకంగా పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా… తాజాగా పురుషుల డబుల్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో 15 ఏళ్ల శార్దూల్‌ విహాన్‌ రజత పతకాన్ని సాధించి ఔరా అనిపించాడు.