రెండు ద‌శ‌ల్లో ఎల్లంప‌ల్లికి గోదావ‌రి జలాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.దీనిలో భాగంగా మేడిగ‌డ్డ బ్యారేజీ నుండి గోదావ‌రి నీటిని మ‌రో రెండు ద‌శ‌ల్లో ఎల్లంప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ కు త‌లిస్తారు. ఇందు కోసం అన్నారం సుందిల్లా బ్యారేజీలు , పంప్ హౌజ్ ల ప‌నులు కొనసాగుతున్నాయి. రెండు లిఫ్ట్ ల ద్వారా ఈ నీటిని ఎల్లంప‌ల్లిలో రివ‌ర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేస్తారు.

 

మేడిగ‌డ్డ పంప్ హౌజ్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ చేసి అన్నారం జ‌లాశ‌యంలో నిల్వ‌చేస్తారు. ఇందుకోసం గోదావ‌రి న‌దిలో 1.216 కిలోమీట‌ర్ల పొడ‌వునా 119 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం జ‌రుగుతుంది. ఇక్క‌డ 10.87 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. 66 గేట్లు నిర్మాణం జ‌రుగుతుంది. 1452 కోట్ల 82ల‌క్ష‌ల రూపాయాల అంచనా వ్యాయంతో ఈ బ్యారేజీ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అన్నారం బ్యారేజీలో నీటిని తిరిగి లిఫ్ట్ చేసేందుకు కాశీపేట ప్రాంతంలో పంప్ హౌజ్ ను నిర్మిస్తున్నారు. ఇక్క‌డ 40 మెగావాట్ల సామ‌ర్ధ్యం క‌లిగిన 8 పంపులు ఏర్పాటు చేస్తున్నారు. అద‌నంగా మ‌రో నాలుగు పంపు ల‌ను కూడా సిద్దం చేస్తున్నారు. ఈ పంపుల ద్వారా 23వేల క్యూసెక్కుల నీటిని అంటే రోజుకు 2టీఎంసీల నీటిని ఎత్తిపోయ‌నున్నారు. ఈ పంప్ హౌజ్ ల వ్యయం 1669 కోట్ల 23 ల‌క్ష‌ల రూపాయ‌లు.

అన్నారం నుండి ఎత్తిపోసిన నీటిని సుందిళ్ళ బ్యారేజీలోకి త‌ర‌లిస్తారు. సిరిపురం ప్రాంతంలో ఈ బ్యారేజీని నిర్మిస్తున్నారు. 129మీట‌ర్ల ఎత్తులో గోదావ‌రి న‌దిపై 1.312కిలోమీట‌ర్ల పొడ‌వున ఈ బ్యారేజీ ప‌నులు జరుగుతున్నాయి. 74గేట్లు ఉండే ఈ బ్యారేజీలో 7.24 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. దీని వ్యయం 1248 కోట్ల 27ల‌క్ష‌ల రూపాయలు. సుందిళ్ళ బ్యారేజీలో ఉన్న నీటిని తిరిగి ఎత్తిపోసేందుకు గోలివాడ వ‌ద్ద పంప్ హౌజ్ నిర్మిస్తున్నారు. ఈ పంప్ హౌజ్‌లో 40మెగావాట్ల సామ‌ర్ద్యం గల 9 పంపులు ఏర్పాటు చేస్తున్నారు. 1737 కోట్ల 56 ల‌క్ష‌ల వ్యయంతో ఈ పంప్ హౌజ్ నిర్మాణం జ‌రుగుతోంది. ఒక్కో పంపు ద్వారా 23వేల క్యూసెక్కుల‌తో రోజుకు 2టీఎంసీల నీటిని పంపుచేస్తారు.

సుందిళ్ళ పంప్ హౌజ్ నుంచి గోదావ‌రి నీటిని శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ కు రివ‌ర్స్ పంపింగ్ చేస్తారు. అక్క‌డ నుంచి కాలువ‌లు .. టెన్నెల్స్ ద్వారా దిగువ‌కు త‌ర‌లిస్తారు.