శరవేగంగా పూర్తి అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు

kaleshwaram project

వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎగువకు లిఫ్ట్ చేసి పంటపొలాలకు మళ్లించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా ముందుకెళుతోంది. మేడిగడ్డ నుంచి నీటిని తరలించేందుకు ఆనకట్టలు, పంపుహౌజులు, టన్నెల్స్‌ ప‌నులు ఉదృతంగా సాగుతున్నాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో బాగంగా జరుగుతున్న పనుల పై టీవీ5 ప్రత్యేక కథనం

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 80 వేలకోట్ల అంచనావ్యయంతో ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే 18లక్ష‌ల ఎక‌రాల కొత్త ఆయ‌క‌ట్టుతో పాటు శ్రీ‌రాంసాగ‌ర్, నిజాంసాగ‌ర్ , సింగూరు ఆయ‌క‌ట్టు లో మ‌రో 18ల‌క్ష‌ల ఎక‌రాల స్థిరీక‌రణ ల‌క్ష్యంగా ఈ ప్రాజెక్టును చేప‌ట్టింది ప్ర‌భుత్వం. ప్రాణహిత నుంచి వస్తున్న నీరు గోదావరిలో కలిసాక నీటిలభ్యత ఎక్కువగా ఉన్న మేడిగడ్డను అనువైన ప్రాంతంగా ఎంచుకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి దిగువన ఉన్న మేడిగడ్డ వద్ద 200 టీఎంసీల నీరు లభ్యత ఉందని గుర్తించి… అంబట్ పల్లి వద్ద ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మేడిగడ్డ వద్ద గోదావరినదికి అడ్డంగా 1.632 కిలోమీటర్ల మేర ఆనకట్ట నిర్మిస్తున్నారు. మహారాష్ట్రతో ఒప్పందం మేరకు వందమీటర్ల ఎత్తున ఈ బ్యారేజీ నిర్మిస్తున్నారు. 1849 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన బ్యారేజికీ 85 గేట్లను బిగిస్తున్నారు. మేడిగడ్డ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు .

మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వచేసి… ఎగువకు లిఫ్ట్ చేస్తారు. ఇందుకోసం ఎగువన కన్నెపల్లి వద్ద భారీ పంప్ హౌజ్ నిర్మిస్తున్నారు. బ్యారేజీలో నిల్వ అయ్యే నీటిని గ్రావిటీ కాలువ ద్వారా త‌ర‌లించి క‌న్నెపల్లి వ‌ద్ద ఏర్పాటు చేసే పంపుల ద్వారా ఎగువ‌కు లిఫ్ట్ చేస్తారు. ఈ పంప్ హౌజ్ నిర్మాణం కోసం 2826.10 ల‌క్ష‌ల వ్యాయం చేయ‌నున్నారు. భూ ఉపరితలం నుంచి 40మీట‌ర్ల దిగువ‌కు త‌వ్వ‌కం జ‌రిపి పంప్ హౌజ్ నిర్మిస్తున్నారు. దీనిలో 40 మెగావాట్ల సామ‌ర్ద్యం క‌లిగిన ప‌ద‌కొండు పంపుల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పంపు ద్వా రా రోజుకు 23వేల క్యూసెక్కుల నీటిని ఎగువ‌కు ఎత్తిపోస్తారు. ప్ర‌స్తుతం 5 పంపులు నిర్మాణం అవుతున్నాయి. భ‌విష్య‌త్తులో రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలుగా ఆరు పంపుల‌ను అద‌నంగా బిగిస్తున్నారు. ఇక్క‌డి నుంచి రోజుకు రెండు టీఎంసీ ల నీటిని అన్నారం బ్యారేజీకి త‌ర‌లిస్తారు. ఇందుకోసం 13కిలోమీట‌ర్ల మేర గ్రావిటీ కెనాల్ నిర్మిస్తున్నారు.