ట్విస్ట్: కేరళకు రూ.700 కోట్లు ఇస్తామని మేం చెప్పలేదు

కేరళ వరద బాధితులకు యూఏఈ ప్రకటించిన ఏడొందల కోట్ల విరాళం వివాదంలో ట్విస్ట్. సాయాన్ని స్వీకరించాలని కేరళ, ప్రసక్తే లేదని కేంద్రం కీచులాడుకుంటున్న సమయంలో యూఏఈ బాంబు పేల్చింది. అసలు తాము సాయం ఎప్పుడు ప్రకటించామంటూ ఈ గొడవలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కేరళ బాధితులకు సాయం చేసేందుకు జాతీయ విపత్తు కమిటీ ఏర్పాటు చేశాంగానీ, ఆర్ధిక సాయంపై ఎలాంటి అధికారిక ప్రకట చేయలేదని యూఏఈ రాయబారి అహ్మద్ అల్బన్నా ప్రకటించారు.

యూఏఈకి వలస వెళ్లిన కేరళవాసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో తమ అభివృద్ధిలో తోడ్పడిన స్నేహితులకు అండగా నిలబడాలని యూఏఈ నిర్ణయించింది. ఆ ఆలోచనలకు అనుగుణంగా వరద నష్టం ఎంత మేర ఉందో..తాము ఏ రకంగా సాయం అందించగలమో అంచనా వేసేందుకు జాతీయ విపత్తు కమిటీని ఏర్పాటు చేసింది. అయితే..అబుదాబి తమకు 700 కోట్ల సాయాన్ని ప్రకటించినందుకదు కృతజ్ఞతలు అంటూ కేరళ సీఎం పినరయి విజయన్ ట్వీట్ చేయటంతో వివాదం మొదలైంది.

దశంలో ప్రకృతి విపత్తులను ఎదుర్కునేందుకు ఇతర దేశాల నుంచి ఆర్ధిక సాయం తీసుకోకూడదని గతంలోనే నిర్ణయించామన్నది కేంద్రం వాదన. 2013 ఉత్తరాఖండ్ వరదల సమయంలోనూ ఇతర దేశాల నుంచి ఆర్ధిక సాయం తీసుకునేందుకు నిరాకరించిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే…పరాయి దేశాల నుంచి సాయం తీసుకునేందుకు అనుమతి ఇవ్వకుంటే మీరైనా ఇవ్వండంటూ కేరళ ప్రభుత్వం కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తోంది. విపత్తుల సమయంలో విదేశీ సాయాన్ని స్వీకరించే విషయంపై 2016లోనే సవరణలు చేశారని వాదిస్తూ వస్తోంది. మీరు ఇవ్వరూ..ఇతరులను సాయం చేయనివ్వరూ అంటూ పినరయి కేబినెట్లోని మంత్రులు కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడొందల కోట్ల విరాళంపై కేంద్రం, కేరళ ప్రభుత్వం కీచులాడుకుంటున్న సమయంలో యూఏఈ ప్రకటన కేరళాను బిత్తరపోయేలా చేసింది. జాతీయ విప్తత్తు కమిటీ నివేదిక తర్వాత సాయంపై ప్రకటన ఉండొచ్చని యూఏఈ రాయబారి క్లారిటీ ఇచ్చారు. అయితే..అది ఆర్ధిక సాయమా? అవసరమైన వస్తువుల రూపంలోనా? తెలియదన్నారు. కానీ, కేరళలో తమ స్నేహితులను ఆదుకుంటామని భరోసా మాత్రం ఇచ్చారు.