ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కేరళ.. మొత్తం వరదసాయం ఎంతంటే..

kerala floods updates

పదిరోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అతలాకుతలమైన కేరళ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరదలు తగ్గుముఖం పట్టడంతో.. పునర్ నిర్మాణం, పారిశుధ్య పనులు ఊపందుకున్నాయి. బురద, చెత్తతో నిండిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్ని శుభ్రం చేయడంతో ప్రజలు నిమగ్నమయ్యారు. శిబిరాల నుంచి ఇళ్లకు చేరుతున్న బాధితులు ఇంట్లో నిండిన బురద, భారీ చెత్తను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. లక్షల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులన్నీ పాడైపోయాయని.. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయని వాపోతున్నారు. మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సిందే అంటూ ఆవేదన చెందుతున్నారు. బావులన్నీ మురికినీటి వల్ల కలుషితం కావడంతో ప్రజలు తీవ్ర తాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు.

పునరావాస కేంద్రాల్లోని ప్రజలను తిరిగి సురక్షితంగా ఇళ్లకు చేర్చాలంటే ముందుగా బహిరంగ ప్రదేశాలను, వారి ఇళ్లను శుభ్రపరిచి నివాసయోగ్యంగా తయారు చేయాలి. కేరళ ప్రభుత్వం ప్రస్తుతం దానిపైనే దృష్టి పెట్టింది. బావులను శుభ్రపరచడం, పైపులైన్లను పునరుద్ధరించడం, విద్యుత్‌ పునరుద్ధరణ లాంటి తక్షణావసరాలపై దృష్టి సారించింది. దాదాపు 3 వేల బృందాలు ఇళ్లను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యాయి. వీళ్లు కాకుండా ఇప్పటికే దాదాపు 12వేల మంది వలంటీర్లు ఇదే పనిలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికి 12 వేల ఇళ్లను శుభ్రం చేశామని… మూడువేల పశువుల కళేబరాలను పూడ్చిపెట్టినట్టు వెల్లడించారు.

కేరళ జల ప్రళయంలో 231 మంది మరణించగా.. ఇంకా 32 మంది ఆచూకీ తెలియడం లేదు. సహాయక శిబిరాల్లో 14.5 లక్షల మంది తలదాచుకున్నారు. కుట్టనంద్, అలపుజా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. కేరళకు కేంద్రం 600 కోట్ల సాయాన్ని విడుదల చేయగా.. ముఖ్యమంత్రి సహాయ నిధికి 309 కోట్ల విరాళాలు అందాయి. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు గోవా ప్రభుత్వం ఐదు కోట్లు… యోగా గురువు రాందేవ్‌బాబా రెండు కోట్ల విరాళం ప్రకటించారు. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయ ధర్మకర్తల మండలి కోటి రూపాయలు ప్రకటించగా.. ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ లారెన్స్‌ కోటి రూపాయలు అందజేశారు.

వరదలతో అతలాకుతలమై నిలువ నీడను కోల్పోయి శిబిరాల్లో తలదాచుకుంటున్న లక్షలాది మంది ప్రజలను కేరళ సీఎం పినరయి విజయన్‌ పరామర్శిస్తున్నారు. ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి… చెంగనూరులోని శిబిరాల్లో కాలం వెళ్లదీస్తున్న బాధితుల చెంతకు వెళ్లారు. చివరి బాధితుడి వరకూ అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.

ఓవైపు జలవిలయంలో తీవ్రంగా నష్టపోయిన కేరళలో సహాయక చర్యలు దాదాపు పూర్తి కావస్తుంటే.. మరోవైపు వరద రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. కేరళ వరదలు మానవ తప్పిదం వల్ల చోటుచేసుకున్న విపత్తేనని రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఒకేసారి 40 ఆనకట్టల గేట్లు ఎత్తడమే… ఈ కల్లోలానికి కారణమని ప్రధాన ప్రతిపక్షంతో పాటు బీజేపీ నేతలు ఆరోపించారు. ఇక.. కేరళ సర్కార్‌ మాత్రం తమ రాష్ట్రంలో వరదలకు తమిళనాడే కారణమంటూ సంచలన ఆరోపణలు చేసింది. ముళ్లపెరియార్‌ డ్యాం నుంచి ఒక్కసారిగా నీళ్లు వదలడంతోనే ఈ విపత్తు చోటుచేసుకుందని ఆరోపించింది. డ్యాం నుంచి ఒకేసారి నీళ్లు విడుదల చేయవద్దని తమిళనాడు సర్కార్‌ను కోరినా వినిపించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది.