తీవ్ర పదజాలంతో అధికారులను దూషించిన ఎమ్మెల్యే

mla-marri-janardhanreddy-fire-on-mro-and-rdo

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి రెవెన్యూ అధికారులను తీవ్ర పదజాలంతో దూషించడం చర్చనీయాంశంగా మారింది. పనికి మాలిన ఆర్టీవో, పనికి మాలిన ఎమ్మార్వో అంటూ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. చేతకాకపోతే లీవ్ పెట్టి వెళ్లిపోండి అంటూ ధ్వజమెత్తారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగలు, అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల నష్టపరిహారంపై బిజినేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌కు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, నిర్వాసిత రైతు హాజరయ్యారు. అయితే పరిహారం విషయంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి రెవెన్యూ అధికారులపై సీరియస్ అయ్యారు. ఒక్క పైసా ఇవ్వకుండానే నాపై నమ్మకంతో ప్రాజెక్టు పనులు చేసుకునేందుకు తాండా వాసులు భూములిచ్చారు. అందుకు గాను వారికి ఇచ్చే పరిహారం తక్కువగా ఎలా ఇస్తారు. మీకు యాక్టు తెలియదా అంటూ మండిపడ్డారు.

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి దూషణలపై మెజిస్ట్రేట్ అధికారులు కన్నెర్ర చేశారు. పని వేళలను లెక్కచేయకుండా అహర్నిశలు కృషి చేస్తున్న తమను ఎమ్మెల్యే కించపరిచేలా మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యే తమకు బహిరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా రెవెన్యూ అసోషియేషన్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలతో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వ్యవహరించారని రెవెన్యూ ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్టు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఉద్యోగులు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈవ్యవహారంపై ఎమ్మెల్యే చర్చిస్తానని,,ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కలెక్టర్ నచ్చజెప్పడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన విరమించారు.