ఎమ్మెల్సీగా తల్లి, ఎమ్మెల్యేగా కూతురు కలిసి పార్టీని బలోపేతం చేస్తారనుకుంటే..

tdp group politics in singanamala

తెలుగుదేశంపార్టీకి పట్టున్న నియోజకవర్గం శింగనమల. ఎస్పీ, బీసీలు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శమంతకమణి గతంలో ఎమ్మెల్యేగా వ్యవహిరించారు. కార్యకర్తలు, ప్రజల్లో ఆమెకు ఫాలోయింగ్ ఉంది. పైగా తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన కేడర్ ఉండడంతో ఇక్కడ విజయం నల్లేరు మీద నడకే. అందుకే ఇక్కడ పోటీకి నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు.

శింగనమల నియోజవర్గంలో తనదైన ముద్రవేసిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ శమంతకమణి ఇంట్లో పోరు ఎక్కువైంది. ప్రభుత్వ అధికారిగా ఉన్న కూతురు యామినిబాలకు టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నారు. చంద్రబాబు ఆమెకు విప్ పదవి కూడా ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీగా తల్లి, ఎమ్మెల్యేగా కూతురు కలిసి నియోజకవర్గంలో పార్టీ బలపేతం చేస్తారనుకుంటే.. ఇద్దరి మధ్య విబేధాలతో రచ్చకెక్కారు. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా పార్టీ పరిస్థితి తయారైంది. టికెట్ ఇప్పించి గెలిపిస్తే తనకే ఎదురుతిరుగుతుందా అంటూ కేడర్ వద్ద శమంతకమణి వాపోతున్నారట. అందుకే వచ్చే ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు అశోక్ పోటీ చేస్తామని.. యామినిబాలకు టికెట్ రాకుండా అడ్డుకుంటామని చెప్పారట. దీంతో తల్లి, అన్న అశోక్ కలిసి తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని.. భావించిన యామినిబాల ద్వితీయశ్రేణి నాయకులను గతంలో శమంతకమణి వెంట నడిచిన నాయకులను తనవైపు తిప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉన్న వారు అధికారిక కార్యక్రమాలకు కూడా కలిసివెళ్లడం లేదు. దీంతో కార్యకర్తలు ఎవరి దగ్గరకి పోతే ఎవరికి కోపం వస్తుందోనని ఆందోళనగా ఉన్నారు.

శమంతకమణి కుటుంబం గొడవలకు పార్టీలో ప్రత్యర్థులు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎమ్మెల్యే యామినిబాల అవినీతి ప్రొత్సహిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ఇవ్వొద్దని ఫిర్యాదులు వెళుతున్నాయి. నాయకులు ఎవరికి వారు తమకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తులతో అధిష్టానం వద్దకు వెళుతున్నారు. గతంలో చివరి వరకూ ప్రయత్నించిన బండారి రవికుమార్ కుటుంబం మళ్లీ ఆ ప్రయత్నాల్లో ఉంది. తమ కుటుంబానికి చెందిన శ్రావణికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, జేసీ దివాకర్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో బండారి కుటుంబం లాబీయింగ్ చేస్తోంది. తమ సామాజిక వర్గానికి 60వేల ఓట్లు ఉన్నాయని.. ఆర్ధికంగా కూడా వనరులు ఉన్నాయని చెబుతున్నట్టు తెలుస్తోంది. శైలజానాథ్ కూడా టీడీపీ తరపున పోటీకి ఆసక్తిచూపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో చివరినిమిషంలో కాంగ్రెస్ తరపున పోటీచేసిన శైలజానాథ్ ఇప్పటికే చంద్రబాబుతో పలుమార్లు కలిసి దీనిపై చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇక్కడ పంచముఖ పోటీ కనిపిస్తోంది. మరి అధినేత చంద్రబాబు మనసులో ఏముందో తెలియాలంటే కొతంకాలం ఆగాల్సిందే.