మిడ్‌ మానేరు’కు ఎల్లంపల్లి నీళ్లు

Mid maneru

ఎల్లం ప‌ల్లి నుండి గోదావ‌రి నీటిని కాలువ‌ల ద్వారా మిడ్ మానేరుకు త‌ర‌లించే ప‌నులు వేగంగా సాగుతున్నాయి సుందిళ్ల పంప్‌హౌజ్‌ నుంచి ఎల్లంప‌ల్లికి చేరిన నీరు… మేడారం ద్వారా మిడ్ మానేరుకు త‌ర‌లించేందుకు 6,7,8 ప్యాకేజీల ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. చొప్ప‌దండి నియోజిక వ‌ర్గం ల‌క్ష్మాపూర్ వ‌ద్ద భారీ పంప్ హౌజ్ నిర్మిస్తున్నారు. ఇక్క‌డి నుండి రోజుకు 2టీఎంసీల నీటిని శ్రీ‌రాంసాగ‌ర్ వ‌ర‌ద కాలువ‌లోకి త‌ర‌లిస్తారు. ఒక టీఎంసీ మిడ్ మానేరు.. మ‌రో టీఎంసీ SRSP పున‌రుజ్జీవ ప‌థ‌కానికి ఉప‌యోగిస్తారు.

గోదావ‌రి నీటిని మిడ్ మానేరుకు త‌ర‌లించే ప‌నులు వేగంగా సాగుతున్నాయి. అప్రోచ్ , గ్రావిటీ కెనాల్స్ తో పాటు ట‌న్నెల్స్ ద్వారా నీటిని త‌ర‌లిస్తారు. ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విభ‌జించారు. 6 వ ప్యాకేజీలో ఎల్లంప‌ల్లి నీటిని మేడారం కు అప్రోచ్ కెనాల్ , రెండు టన్నెల్స్ ద్వారా త‌ర‌లిస్తారు. ఇందులో అప్రోచ్ కెనాల్ ప‌నులు ఇప్పటికే పూర్తికాగా తొమ్మి‌దిన్న‌ర కిలోమీట‌ర్ల ట‌న్నెల్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఏడో ప్యాకేజీలో 11.24కిలోమీట‌ర్ల ట‌న్నెల్ నిర్మిస్తున్నారు. ఎని‌మిదో ప్యాకేజీలో రెండు టన్నెల్స్ నిర్మాణం కొన‌సాగుతున్నాయి. ఒక్క టన్నెల్ ప‌నులు పూర్తికాగా మ‌రో టన్నెల్ ప‌నులు తుదిద‌శ‌లో ఉన్నాయి. ప‌దిమీట‌ర్ల వెడ‌ల్పు ప‌దిమీట‌ర్ల ఎత్తుతో వీటిని నిర్మిస్తున్నారు. ఈ ట‌న్నెల్స్ నుండి వ‌చ్చిన నీటిని అప్రోచ్ కెనాల్ లోకి ఎత్తిపోసేందుకు చొప్ప‌దండి నియోజిక వ‌ర్గం రామ‌డుగు మండ‌లం ల‌క్ష్మాపూర్ వ‌ద్ద పెద్ద పంప్ హౌజ్ నిర్మిస్తున్నారు. భూగ‌ర్భం లోనే పంప్ హౌజ్ నిర్మాణంతో పాటు స‌ర్జ్‌పూల్ నిర్మాణం ప‌నులు వేగంగా సాగుతున్నాయి. 139మెగావాట్ల సామ‌ర్ద్యం క‌లిగిన ఏడు భారీ పంపుల‌ను ఇక్కడ బిగిస్తున్నారు. ఇప్ప‌టికి రెండు పంపుల‌కు మోట‌ర్ల బిగింపు పూర్తైంది. BHEL అందిస్తున్న ఈ మోటార్లలో ఇప్ప‌టికే రెండు డ్రై ర‌న్ లు పూర్తిచేసారు. వ‌చ్చే అక్టోబ‌ర్ క‌ల్లా మిడ్ మానేరుకు నీరు ఇవ్వాల‌ని యుద్ద‌ప్రాతిప‌దిక‌న ప‌నులు చేస్తున్నారు.

ఈ పంప్ హౌజ్ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్ట్‌ చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా దిగువ‌కు త‌ర‌లిస్తారు. ఇది వ‌ర‌ద కాలువ‌లో 99 వ కిలోమీట‌ర్ వ‌ద్ద క‌లుస్తుంది. ఇక్కడ నుంచి ఒక టీఎంసీనీ మిడ్ మానేరుకు మ‌రోటీఎంసీని ఎస్ఆర్ఎస్పీ పున‌ర్జీవ‌న ప‌థ‌కానికి త‌ర‌లిస్తారు.