దేశీ స్టాక్‌ మార్కెట్లు ఖుషీ!

desi stock market updates

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైనప్పటికీ చెప్పుకోదగ్గ లాభాలు ఆర్జించాయి. శుక్రవారం(24)తో ముగిసిన వారంలో సెన్సెక్స్‌ నికరంగా 304 పాయింట్లు(0.8 శాతం) పుంజుకుని 38,252 వద్ద నిలిచింది. నిఫ్టీ 86 పాయింట్లు(0.75 శాతం) బలపడి 11,557 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ యథాతథంగా ముగియగా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ మార్కెట్లను మించుతూ 1.5 శాతం జంప్‌చేయడం విశేషం!
విదేశీ అంశాలు
వాణిజ్య వివాదాల పరిష్కారానికి అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య చర్చలు జరిగినప్పటికీ రెండు దేశాలూ 1600 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులపై పరస్పరం 25 శాతం చొప్పున సుంకాలను విధించాయి. మరోవైపు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గుచూపుతుంటే.. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్ ఇందుకు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
బ్లూచిప్స్‌ జోరు
సెన్సెక్స్‌ దిగ్గజాలలో ఎల్‌అండ్‌టీ 8 శాతంపైగా దూసుకెళ్లింది. సుమారు రూ. 9,000 కోట్లతో షేరుకి రూ. 1500 ధర మించకుండా 6 కోట్ల ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించడంతో ఈ కౌంటర్‌కు జోష్‌ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ బాటలో ఇంధన దిగ్గజాలు ఓఎన్‌జీసీ 7 శాతం, ఆర్‌ఐఎల్‌ 6 శాతం చొప్పున జంప్‌చేయడం విశేషం. కాగా.. సీఎఫ్‌వో రంగనాథ్‌ రాజీనామా కారణంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ 3.6 శాతం తిరోగమించగా.. విప్రో 4.5 శాతం జంప్‌చేసింది. మరోవైపు ప్రయివేట్‌ రంగ దిగ్గజాలు యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్ 5-2 శాతం మధ్య క్షీణించాయి.