లాలూకు ఒకేరోజు రెండు ఎదురు దెబ్బలు

lalu-yadav-ordered-to-return-to-jail-by-august-30-court-refuses-to-extend-his-parole

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఒకేరోజు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకి… తాత్కాలిక బెయిలు గడువును పొడిగించేందుకు జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు ఐఆర్‌సీటీసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దీంతో లాలూకి మరో ఉచ్చు బిగుస్తోందని ఆర్జేడీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా నిర్ధారణ కావడంతో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లో అనారోగ్యానికి గురి కావడంతో… మే 11న పెరోల్‌పై బయటకు వచ్చారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాల రీత్యా అప్పటి నుంచి పెరోల్‌ను పొడిగిస్తూ వచ్చారు. దీంతో మరో మూణ్నెల్లపాటు పెరోల్‌ పొడిగించాలని జార్ఖండ్‌ హైకోర్టులో లాలూ పిటిషన్‌ వేశారు. అయితే ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈనెల 30లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు లాలూకి చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
.
మరోవైపు మనీ లాండరింగ్‌ కేసులో లాలూ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌… ఐఆర్‌సీటీసీ హోటళ్ల కాంట్రాక్టును కట్టబెట్టడంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించింది. ఈ కేసులో లాలూ ప్రసాద్‌, ఆయన సతీమణి రబ్రీదేవితో పాటు పది మందిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -