బెర్లిన్‌లో ఇండియన్ ఓవర్సీ కాంగ్రెస్ లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించిన రాహుల్

rahul gandhi again comments on ap special status

ఆంధ్రప్రదేశ్‌ను విభజించి రాష్ట్రంలో పార్టీకి సమాధి కట్టుకున్న కాంగ్రెస్‌ అధినాయకత్వం… మళ్లీ ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. జనానికి సెంటిమెంట్‌గా మారిన ప్రత్యేక హోదాను ఆయుధంగా మార్చుకుని… ఓట్లు రాబట్టేందుకు పావులు కదుపుతోంది. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్‌ వేదికగా చెప్పిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ… ఇప్పుడు విదేశీ వేదికలపైనా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

బెర్లిన్‌లో ఇండియన్ ఓవర్సీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్‌గాంధీ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని… దీన్ని తామంత తేలిగ్గా తీసుకోబోమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా కల్పిస్తామని.. ఇది ఏపీ ప్రజలకు తాను ఇస్తున్న హామీ అని అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో పాలనను ప్రధాని మోదీ బలహీనపరుస్తున్నారని రాహుల్ ఆరోపించారు.

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సమయంలో… రాహుల్‌గాంధీ నోట హోదా మాట రాలేదని మిగతా పార్టీలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో ఆయన దిద్దుబాటుకు దిగినట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఏపీలో లాభపడాలంటే.. హోదా ప్రస్తావన తప్పనిసరి అని రాహుల్‌కి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విదేశీ వేదికలపైనా ఏపీ అంశాలను రాహుల్‌ ప్రస్తావిస్తున్నారు. జర్మనీలో రెండ్రోజుల పర్యటన ముగించుకున్న రాహుల్‌… అక్కడ్నించి యూకే వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ విద్యార్థులతోనూ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌తోనూ ఆయన సమావేశమవుతారు.