తెలుగు నేతలకు రాహుల్‌ మరో షాక్‌

rahul gandhi coming hyderabad by monday

తెలుగు కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ మరోసారి షాకిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు వడివడిగా అడుగులు వేస్తోన్న రాహుల్‌.. తెలుగు నేతలను ఏమాత్రం పట్టించుకోలేదు. 2019 ఎన్నికలకు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కీలక కమిటీలను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కోర్‌ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ కమిటీలను నియమించింది. కానీ అందులో ఒక్క తెలుగు వారి కూడా అవకాశం ఇవ్వలేదు.

తొమ్మిది మంది సభ్యుల కోర్‌ కమిటీలో అశోక్‌ గెహ్లట్‌, ఏకే ఆంటోనీ, గులామ్‌ నబీ ఆజాద్‌, మల్లిఖార్జున ఖర్గే, అహ్మద్‌ పటేల్‌, జైరామ్‌ రమేశ్‌, చిదంబరం ఉన్నారు. 19 మందితో మేనిఫెస్టో కమిటీ, 13 మంది సభ్యులతో పబ్లిసిటీ కమిటీలను ఏర్పాటు చేశారు. జైరామ్‌ రమేశ్‌, చిదంబరం.. కోర్‌ కమిటీ, మేనిఫెస్టో కమిటీల్లోనూ ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు మేనిఫెస్టో తయారు చేయడానికి, పబ్లిసిటీ ప్రణాళిక రూపొందించే పనిలో ఈ కమిటీలు నిమగ్నం కానున్నాయి..

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన కీలక కమిటీల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నాయకులకు ఛాన్స్‌ ఇవ్వలేదు. మూడు కమిటీల్లో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలకు మొండిచేయి చూపారు. వచ్చే ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగు నాయకులను హైకమాండ్‌ పట్టించుకోకపోవడం కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్న రాహుల్‌ గాంధీ.. కమిటీల్లో మాత్రం తెలుగు నేతలను అస్సలు పట్టించుకోలేదు.