అమ్మభాషలో మాట్లాడితే ‘ఐక్యూ’ సూపరట..

మాతృభాష కాకుండా మరిన్ని భాషలు మాట్లాడే వారిని చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఇన్ని భాషలు ఎలా మాట్లాడగలుగుతున్నారా అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. బహు భాషా కోవిదులు ప్రముఖుల్లోనే కాదు సామాన్యులు సైతం అనర్గళంగా ఆరు భాషల్ని అవలీలగా మాట్లాడేయగలరు. అయితే ఎన్ని భాషలు మాట్లాడినా అమ్మనేర్పించిన భాషనే ఇంట్లో కూడా మాట్లాడే పిల్లల్లో తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని ఓ సర్వే తేల్చింది.

స్కూల్లో ఇంగ్లీష్, హిందీతో పాటు మరో భాష నేర్చుకునే సౌకర్యం ఉంటుంది. అక్కడ ఎన్ని భాషలు మాట్లాడినా ఇంటికొచ్చాక కమ్మనైన అమ్మభాషలో మాట్లాడితే మధురంగా ఉండటమే కాదు, మంచి నైపుణ్యం కనబరుస్తారని బ్రిటన్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఓ 100 మంది పిల్లలను పరిశీలించిన బ్రిటన్ పరిశోధకులు తేల్చిందేమంటే కొత్త విషయాన్ని వేరే భాషలో కంటే మాతృభాషలోనే పిల్లలు త్వరగా అర్థం చేసుకోగలుగుతారని చెబుతున్నారు.

వేరే భాషలో అయితే అర్థం చేసుకోవడానికి పిల్లలు కొంత ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అందుకే పిల్లలను ఇంట్లో మాతృభాషలో మాట్లాడిస్తూ వారికి కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి కలగజేయాలన్నారు. అమ్మానాన్న మాత్రమే ఆపని చేయగలరన్నారు.