35 ఏళ్ల క్రితం తాత దొంగిలిస్తే.. మనవడు..

వస్తువు చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు. పోయిందనుకున్నది తిరిగి వచ్చిందంటే చెప్పలేనంత ఆనందం. అందునా ఒకటి కాదు రెండు కాదు.. 35 ఏళ్ల క్రితం పోవడం కూడా కాదు దొంగిలించబడిన వస్తువు దొరికింది. దోచుకెళ్లిన వ్యక్తి తాలూకు మనిషే బుద్దిగా తీసుకు వచ్చి ఇస్తే పట్టలేనంత సంతోషం. గుజరాత్‌లోని బనస్కాంతా జిల్లాలోని చల్వా గ్రామానికి చెందిన దినేష్‌ నగల వ్యాపారం చేస్తుండేవారు. లక్షరూపాయలు ఖరీదు పెట్టి ఓ జీపుని కొన్నాడు. జీపు మీద కన్నేసిన ఓ వ్యక్తి దాన్ని చోరీ చేశాడు. అయితే దినేష్ జీప్ పోయిందని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అలానే 35 ఏళ్లు గడిచిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దొంగిలించిన వ్యక్తి మనవడు వచ్చి దినేష్ కొడుకు సునీల్ ఇంటి ముందు పెట్టాడు. తండ్రి దినేష్ ద్వారా జీప్ చోరీకి గురైందన్న విషయం తెలుసుకున్న సునీల్ ఇన్నేళ్ల తరువాత ఇంటిముందు జీప్ ప్రత్యక్షమయ్యేసరికి నిజమా కలా అంటూ ఆశ్చర్యపోతున్నాడు. ఈ విషయాన్ని మీడియాకు వివరించాడు. అతడు భార్యతో సహా వచ్చి జీప్‌ని అప్పగించడం ఆనందంగా ఉందంటున్నాడు. ఎవరైనా ఊహిస్తారా.. పోయిందనుకున్న వస్తువు 35 ఏళ్ల తరువాత తిరిగి వస్తుందని.. అందుకే అతడికి అంత ఆనందం.