అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ‘రాఖీ’

రాఖీ పండుగ ఎలా వచ్చిందో చెబుతూ ఎన్నో పురాణ గాథలు వినిపిస్తుంటాయి. వాటిల్లో ఒకటి.. వంద తప్పులు చేసిన శిశుపాలుడిని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో చంపే సమయంలో కృష్ణుడి వేలుకి రక్తం కారుతుంటుంది. అక్కడే ఉన్న ద్రౌపతి వచ్చి తన చీరకొంగుని చింపి కృష్ణుడి వేలుకి కట్టు కడుతుంది. తనని అన్నగా భావించి వేలుకి కట్టు కట్టిన ద్రౌపతితో ఎల్ల వేళలా రక్షగా ఉంటానని కృష్ణుడు వాగ్ధానం చేస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం ద్రౌపతిని నిండు సభలో కౌరవులు వివస్త్రను చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆమె మానాన్ని కాపాడుతాడు.

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు.. ఆ బంధం ఎంతో మధురం. ప్రేమకు ప్రతి రూపాలు అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు. చిన్నప్పుడు అన్న చెల్లిలి చేయి పట్టుకుని స్కూలుకు తీసుకువెళితే ఎంతో ధైర్యం. కాలేజీకి వెళ్లినప్పుడు ఎవరైనా పోకిరీలు ఏడిపిస్తుంటే, అన్నకు చెప్పి వారికి వార్నింగ్ ఇప్పిస్తే బోలెడంత భరోసా. పెళ్లైన తరువాత అప్పగింతలప్పుడు అమ్మానాన్నను వదిలివెళుతున్నందుకు బాధ కంటే అన్నను వదిలి వెళుతున్నానన్న బాధ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఆడపడుచుకీ.

అన్న ఇంటికి వస్తే చెల్లికి ఎంతో ఆనందం. తను తెచ్చిన కానుకలకంటే అన్న వచ్చాడన్న ఆనందం ఒక పట్టాన నిలువనీయదు. మంచి చెడూ అన్నీ అన్నతో పంచుకుంటుంది. అమ్మా నాన్న ఆరోగ్యం దగ్గరనుంచి ఊరి విషయాలన్నీ అన్నని అడిగి తెలుసుకుంటుంది. ప్రేమగా వండి పెడుతుంది. రాఖీ పేరుతో వచ్చే ఈ పండుగ అంటే అన్నా చెల్లెళ్లకు ఎంతో ఇష్టం. అన్నకు రాఖీ కట్టే సమయంలో తను ఇచ్చే బహుమతి కంటే నీకు నేనున్నాను తల్లీ అంటూ.. ఆప్యాయంగా పలకరించే ఆ పిలుపు ఆమెకు కొండంత అండ. ఇరువురి ప్రేమ బంధానికి చిరకాలం శ్రీరామ రక్ష ఈ రక్షా బంధన్.