పీడీ అకౌంట్ల వ్యవహారంపై కొనసాగుతున్న రాజకీయ రగడ

tdp vs bjp over pd accounts issue

ఆంధ్రప్రదేశ్‌లో పీడీ అకౌంట్ల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. పీడీ అకౌంట్ల ద్వారా 53 వేల కోట్లను దారి మళ్లించారంటూ పోరాటం చేస్తున్న బీజేపీ నేతలు… ఇప్పటికే గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు నిత్యం విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 53 వేల కోట్లను దారి మళ్లించారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సవాల్ ఆరోపించారు. 58 వేల పీడీ ఖాతాలు తెరిచి కొత్త దోపిడీకి రాష్ట్రప్రభుత్వం తెరతీసిందని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని జీవీఎల్‌ సవాల్‌ విసిరారు.

మరోవైపు జీవీఎల్‌ ఆరోపణలకు మంత్రి నక్కా ఆనంద్‌బాబు కౌంటర్‌ ఇచ్చారు. పీడీ ఖాతాలపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు.. కావాలంటే వాటిపై విచారణ జరిపించుకోవచ్చని స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు నాలుగేళ్ల పాటు కనిపించని అవినీతి.. బీజేపీ నేతలకు ఇప్పుడు కనిపిస్తోందని విమర్శించారు.

మొత్తానికి బీజేపీ, టీడీపీ నేతల మధ్య రోజురోజుకీ విమర్శల యుద్ధం ముదిరిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల మళ్లింపు వ్యవహారాన్ని బయటపెడతామని కమలనాథులు అంటుండగా.. శనిగ్రహాల్లా తయారయ్యారని తెలుగు తమ్ముళ్లు ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.