దెయ్యం సోకిందంటూ మహిళను చావగొట్టిన పూనకాల సామి

woman, beaten by, man

గాలి సోకిందని గగ్గోలు పెట్టాడు. గాలిలో తనకేదో కనిపిస్తున్నట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ప్రాణాలు పోతాయంటూ పూనం వచ్చిన వాడిలా పెద్ద పెద్ద కేకలతో బెంబేలెత్తించాడు. నిన్ను క్షమిస్తే నా ప్రాణం పోతుందంటూ మూఢ విశ్వాసం ముసుగులో ఓ మహిళలను చిత్రహింసలు పెట్టాడో పూనకాల సామి. కింద పడేసి..బండకేసి బాదేసి ప్రాణం తీసినంత పనిచేశాడు.

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం..నాగలవెలటూరులో ఈ దారుణం చోటుచేసుకుంది. తలను అదే పనిగా బండకేసి కొడుతూ..పూనకం వచ్చినవాడిలా ఊగిపోతున్న ఈ వ్యక్తి పేరు తోడేటి హరిబాబు. తనలోకి నరసింహస్వామి ఆత్మ వస్తుందని చుట్టుపక్కల జనాల్ని నమ్మించాడతను. తన దగ్గరకు వస్తే ఎంతటి మొండి దెయ్యాలనైనా వదలగొడతానని బిల్డప్ ఇస్తాడతను. తన దగ్గరికి వచ్చే జనాల్ని నమ్మించేందుకు ఇదిగో ఇలా గాలిలో దెయ్యాలతో మాట్లాడినట్టు కలరింగ్ ఇస్తూ..జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.

సైకో పేషంట్లా చెలరేగిపోయిన హరిబాబు అలియాస్ పునకాల సామి చేతిలో చావు దెబ్బలు తిన్న ఆ బాధితురాలి పేరు దామినేని హైమావతమ్మ. పోలేరమ్మ ఆలయంలో పూజలు చేస్తూ ఉంటుంది. పోలేరమ్మ గుడి పూజారికే దెయ్యం సోకిందంటూ హరిబాబు అమెపై హత్యాయత్నం చేసినంత పని చేశాడు. క్షమించమని ఎంతగా వేడుకున్నా హైమావతమ్మను వదల్లేదు అతను. నిన్ను వదిలితే నా ప్రాణాలు పోతాయంటూ ఆమె తలకు గాయం అయ్యేలా రాక్షసంగా హింసించాడు. తనకు నరసింహస్వామి ఆత్మ సోకిందంటూ ఆమెపై దాడి చేశాడు.

నిజమే అనుకొని అలాగే వదిలేస్తే హైమవతమ్మ ప్రాణాలు పోయేవే. హరిబాబు సైకో వేషాలు శృతి మించిపోవటంతో..పరిస్థితిని అర్ధం చేసుకున్న ఓ యువకుడు ధైర్యం చేశాడు. సైకో సామి బారి నుంచి ఆమెను రక్షించాడు. అప్పటికే తలకు గాయం అయి రక్తం కారుతోంది. హరిబాబు చేతిలో నుంచి తప్పించుకున్న హైమవతమ్మ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.