పాముల దెబ్బకు హోమం..

huge-snakes-in-avanigadda

కృష్ణా జిల్లాలో పాముల బెడదతో రైతులు భయపడిపోతున్నారు. అవనిగడ్డ, చల్లపల్లి, నాగాయలంక,మోపిదేవి ప్రాంతంలో పాముల సమస్య మరింత తీవ్రంగా ఉంది. వారం రోజుల వ్యవధిలో దాదాపు 180 మంది రైతులు పాముకాటుకు గురయ్యారు. దీంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నాగదోషం పరిహరింపబడాలని కోరుతూ ఈ నెల 29న సర్పశాంతి హోమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం వేదిక కానుంది. వరి నాట్లు వేయటానికి పొలాల్లోకి వెళ్లిన వారిని పగ పట్టినట్టుగా పాములు కాటేస్తున్నాయి. పొలాల్లో పెద్ద ఎత్తున ఎలుకలు ఉండటంతో వాటి కోసం పాములు మాటు వేస్తున్నాయి. పొలాల్లో నాట్ల కోసం దిగుతున్న రైతు కూలీలపై విరుచుకు పడుతున్నాయి. దొరికిన వాళ్లను దొరికినట్టు పాములు కాటేస్తుంటే.. చేతికి చిక్కిన పామునల్లా జనం చంపేస్తున్నారు. ఒక దాన్ని చంపితే మరోటి వస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి దివిసీమలో కనిపిస్తోంది. అవనిగడ్డ ఆస్పత్రి నిండా పాము కాటు బాధితులే కనిపిస్తున్నారు. వార్డులు, బెడ్లన్నీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి.