కొబ్బరినూనెను కూడా ఫారినోళ్లు వదిలిపెట్టరా?

కొబ్బరి నూనె వంటకి మంచిది కాదా..? దాంతో చేసిన వంటలు తింటే కోరి గుండె జబ్బులు కొని తెచ్చుకున్నట్టా? అసలే ఇప్పుడు వీరమాచినేని డైట్ లాంటివి జనం తెగ ఫాలో అయిపోతున్నారు. ఈ టైములో ఎవరో ఫారినర్ ఓ సర్వే చేసి.. కొబ్బరి నూనె పాయిజన్ తో సమానం అంటే గుండె ఝల్లుమనదూ..? కచ్చితంగా ఇప్పుడిదే జరుగుతోంది. సరే.. అసలా ప్రొఫెసర్ చెప్పిందేంటి.. ఎక్కడో హార్వార్డ్ యూనివర్సిటీ వాళ్లు మనం తినే ఫుడ్డు మంచిదో కాదో ఎలా డిసైడ్ చేసేస్తారు? ఓసారి చూద్దాం ఇందులో వాస్తవాలేంటో.

దక్షిణ భారతదేశంలోని వంటకాల్లో కొబ్బరినూనె విరివిగా వాడతారు. ముఖ్యంగా కేరళలో. అక్కడ వంటకాలు 90 శాతం దీంతోనే వండుతారు. ఆ మాటకొస్తే.. శ్రీలంక, ఇండోనేషియా సహా మరికొన్ని ఆసియా దేశాల్లోనూ వంటల్లో కొబ్బరి నూనె బాగా వినియోగిస్తారు. ఐతే.. ఈ నూనెలో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి హానికరం అన్నది హార్వర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ ఎపిడిమియాలజిస్ట్ కెరిన్ మిషెల్స్ చెప్తున్న మాట. సాధరణంగా ప్రతి నూనెలోనూ ఈ తరహా గాఢత ఎక్కువగా ఉండే కొవ్వు ఉంటుంది. వేరుసెనగ నూనె, చీజ్ ఇలా మనం తినే చాలా వాటిల్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువే. దీనివల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్టరాల్ పెరుగుతుందని, దీనివల్ల కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు మూసుకుపోతాయని హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులకు ఆస్కారం ఉందంటున్నారు. మిగతా నూనెలతో పోలిస్తే కోకోనట్ ఆయిల్ తింటే పాయిజన్ తిన్నట్టేనంటున్నారు. తన ప్రసంగంలో పదేపదే కొబ్బరి నూనెను పాయిజన్ అంటూ చెప్పుకొచ్చారు.

నిజంగా కొబ్బరి నూనె ఆహారంలో తీసుకుంటే “లోడెన్సిటీ లైపో ప్రొటీన్- LDL” పెరిగిపోతుందా అంటే.. ఈ వాదన అస్సలు నిజం కాదంటున్నారు భారత న్యూట్రిషినిస్టులు, ప్రముఖ చెఫ్ లు.
కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల..
1. ఒంట్లో కొవ్వు కరుగుతుంది. (ఫ్యాట్ బర్నర్ అన్నమాట)
2. జుట్టుకు, చర్మానికి, దంత సమస్యలకు పరిష్కారం
3. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
4. మెదడు షార్ప్ అవుతుంది. అల్జీమర్స్ లాంటివి దరిచేరవు.
5. శరీరంలో సూక్ష్మజీలను చంపుతుంది.
6. కిడ్నీ సమస్యలు రావడాన్ని నివారిస్తుంది.

అనారోగ్యం కలగకుండా చూడడంలో కొబ్బరిది మంచి పాత్రేనన్నది మన దగ్గర జరిపిన పరీక్షల్లో తేలిన విషయం. రోజూ 50 గ్రాముల వరకూ కొబ్బరి నూనె ఆహారంలో తినొచ్చు. కేరళ వాసులు కొన్ని వందల ఏళ్లుగా వంటల్లో దీన్ని వాడుతున్నారు. అలాగని అక్కడ వాళ్లెవరూ తీవ్రమైన హృద్రోగాల బారిన పడ్డట్టు లెక్కలేమీ లేవు. 1970లతో పోలిస్తే ఇప్పుడు గుండె జబ్బు పేషెంట్లు పెరిగిన మాట వాస్తవమే అయినా.. ఇలా హార్ట్ ఎటాక్ కి గురవుతున్న వారిలో షుగర్ పేషెంట్లే అత్యధికం. అలాగే మారుతున్న ఆహారపు అలవాట్లు, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి అనారోగ్యాలకు కారణాలు అవుతున్నాయి తప్ప.. కొబ్బరి నూనె వల్ల ముప్పు లేదన్నది మన దేశపు సైంటిస్టులు, న్యూట్రీషియనిస్టుల మాట.

– హార్వర్డ్ ప్రొఫెసర్ చేసిన సర్వే శాంపిల్ సైజ్ ఎంత..
– అమెరికన్స్ ఫుడ్ అలవాట్లపై చేసిన సర్వే మనకు అన్వయించడం కరెక్టా..

పాశ్చాత్య దేశాల్లో వాళ్ల ఆహారపు అలవాట్లకు, మనం తినే ఆహారానికి చాలా తేడా ఉంటుంది. వారు తీసుకునేదాంట్లో ఎక్కువగా రెడీమేడ్ ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది. ఇందులో సహజంగానే ఫ్యాట్ కంటెంట్, కొలెస్టరాల్ ఎక్కువ. మెక్ డీ, సబ్ వే, కేఎఫ్ సీ, కోకోకోలా లాంటి ఏ బ్రాండ్ తీసుకున్నా అన్నీ రెడీమేడ్ ఫుడ్డే. మనలాగా వాళ్లు తాజా కూరగాయలు, ఇతరత్రా వంటలు వేడివేడిగా వండుకుని తినేది తక్కువ. కాబట్టి అక్కడి వాళ్లు కొబ్బరి నూనె తీసుకుంటే శరీరంలో సాచురేటెడ్ ఫ్యాట్ మరింత పెరిగేతే ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. కాబట్టి వాళ్ల దృష్టిలో కొబ్బరి నూనె హానికరం అయ్యి ఉండొచ్చు. కానీ.. మన దేశపు ఆహారపు అలవాట్లకు తగ్గట్టు చూస్తే ఆ సర్వేను, ఆ ప్రొఫెసర్ ప్రసంగాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు. మన దగ్గర కేరళలో అత్యధికంగా కొబ్బరి నూనె వాడతారు. ఈ సర్వే ప్రకారం అది హానికరమే అయితే.. అక్కడ సగటు ఆయుప్రమాణం తగ్గాలి. కానీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే కేరళలోనే మెరుగైన జీవనశైలి, ఆయుప్రమాణం ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి. అక్కడ సగటు జీవితకాలం 74 ఏళ్లు. ఇది చాలు.. మన వంటికి కొబ్బరి నూనె చెడు చేయదు అని చెప్పడానికి అంటున్నారు కేరళవాసులు. నిజానికి.. కొబ్బరి నూనె ప్రమాదకరం అంటూ కొన్నేళ్లునగా ఫారిన్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా లేక నిర్దేశిత ఆధారాలతో చెప్తున్నారా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు
ఉన్నాయి.

ప్రస్తుతం మన దగ్గర బరువు తగ్గాలనుకునే వారు రకరకాల డైట్ లు ఫాలో అవుతున్నారు. వీళ్లంతా లిక్విడ్ డైట్, సాలిడ్ డైట్ ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. రోజూ కనీసం 50గ్రాముల కొబ్బరి నూనె తీసుకుంటున్నారు. ఇది ఫ్యాట్ కంటెంట్స్ ను బర్న్ చేస్తుందని తద్వారా బరువు తగ్గుతామని నమ్ముతున్నారు. మెజార్టీ ప్రజల్లో ఇది ఫలితాల్ని ఇస్తోంది కూడా. ఐతే.. వెయిట్ లాస్ విషయంలో సొంత వైద్యం కంటే డాక్టర్ల సలహా ప్రకారం ముందుకు వెళ్లడమే మంచిది. ఇది పక్కకు పెడితే.. తాజాగా హార్వార్డ్ లోని టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ మిషెల్ ఇచ్చిన రిపోర్టు బాగానే చర్చనీయాంశమైంది. బీఫ్, చీజ్ లాంటి వాటిల్లో కొవ్వుతో పోలిస్తే.. కొబ్బరి నూనె ప్యూర్ పాయిజన్ అంటూ ఆమె ఇచ్చిన లెక్చర్ కలకలం రేపింది. ఐతే.. న్యూట్రిషినిస్టులు మాత్రం ఫారిన్ పబ్లిక్ పై చేసిన సర్వేను మనతో పోల్చి చూసుకుని టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్నారు.