నేవీ అంబుల పొదిలోకి అధునాతన అస్త్రాలు

navy

భారత రక్షణ శాఖ మరింత పటిష్టం కానుంది. నేవీ అంబుల పొదిలోకి అధునాతన అస్త్రాలు చేరబోతున్నాయి. మేక్ ఇన్ ఇండియా పథకానికి ఊపునిచ్చేందుకు చేపట్టిన వ్యూహాత్మక భాగస్వామ్యం విధానంలో తొలి ప్రాజెక్టుగా రక్షణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది.

భారత నౌకాదళాన్ని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 21వేల కోట్లతో 111 యుటిలిటీ హెలికాప్టర్ల కొనుగోలు- సేకరణకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రక్రియకు అనుమతులు మంజూరు చేసింది. 46 వేలకోట్ల విలువైన రక్షణ సామగ్రి సమకూర్చుకునేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఈ హెలికాప్టర్లను సేకరించనుంది. విదేశీ, స్వదేశీ సంస్థల భాగస్వామ్యంతో వీటిని రూపొందించనుంది. ఈ హెలికాప్టర్లను సర్జికల్ స్ట్రైక్స్, గాలింపు, సహాయక చర్యలు, నిఘాల కోసం ఉపయోగించనుంది.

new-helicopters-to-be-bought-for-navy

డీఏసీ సమావేశంలో 24వేల 879కోట్లతో సైన్యానికి స్వదేశీ పరిజ్ఞానంతో 155ఎంఎం అత్యాధునిక ఆర్టిలరీ గన్‌ సిస్టమ్స్‌ను 150 సమకూర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ తుపాకులను డీఆర్‌డీఓ డిజైన్‌ చేసింది. డీఏసీ మరో 24 నావల్‌ మల్టి రోల్‌ హెలికాప్టర్ల సేకరణకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే నిలువుగా ప్రయోగించగల తక్కువ రేంజ్‌ క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకోవాలని, అందులో పది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినవి ఉండాలని నిర్ణయించింది.

డీఏసీ అనుమతులకు 18 నెలల గడువు ఉంటుంది. ఈ గడువులోగా భారత నావికా దళం ప్రక్రియను అమల్లోకి తీసుకురావాలి. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్‌ ఎంపిక చేయాలి. తగిన ఇండియన్ పార్టనర్‌ను సమకూర్చుకుని, భారతదేశంలో హెలికాప్టర్లను తయారు చేయవలసి ఉంటుంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -