నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. బ్రదర్ రాఖీ

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ.. సోదరికి కొండంత అండగా నిలిచి, ఆకాశమంత ప్రేమను పంచే పండుగ రోజు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ రాఖీ.. శ్రావణ పౌర్ణమి రోజు వచ్చేసింది.. సోదరులకు రక్ష కట్టేందుకు ఆడపడుచులంతా ఉత్సాహంగా సిద్ధమయ్యారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కథనం.

మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని గుర్తు చేస్తాయి మన పండుగలు..అందులో ప్రముఖమైనది శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ.అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని మరింత గాఢంగా ముడివేస్తూ ఏడాదికోమారు జరుపుకునే అనుబంధాల వేడుక రక్షాబంధన్‌. తోడబుట్టినవారు సంతోషంగా కలకాలం ఉండాలని ఆకాంక్షించుకునే సందర్భం.నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. కష్టసుఖాల్లో ఒకరికొకరం సంరక్ష .. ఇదే ఈ పండుగలోని అంతరార్ధం.ప్రేమను పంచిన సోదరుల నుంచి అమితమైన ఆప్యానురాగాలను కాంక్షిస్తూ కట్టే రాఖీలో ప్రేమానుబంధాల ముడి ఉంది. అన్నదమ్ములు లేని వారు తాము సోదరులుగా భావించే వారికి రాఖీ కట్టి తమ అనుబంధాన్ని చాటుకుంటారు.

భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడుచును దేవతా స్వరూపంగా భావిస్తారు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మిగా పిలుచుకుంటాం.. ఆడపిల్ల పుట్టిందంటే నట్టింట మహాలక్ష్మి పుట్టినట్లుగా భావించే సంప్రదాయం మనది. అందుకే, శ్రావణ పౌర్ణమి నాడు సోదరి చేత రక్ష కట్టించుకుంటారు సోదరులు. ఈ రక్షతో దేవతలందరి రక్షణ కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న విశ్వాసం.

మన దేశంలో దీపావళికి బాణసంచా ఏ రేంజ్‌లో అమ్ముడుపోతాయో.. అదే స్థాయిలో రాఖీలు సేల్‌ అవుతాయి. పెళ్లయి అత్తవారింటికి వెళ్లినా, ఈ రోజు రెక్కలు కట్టుకుని పుట్టింట్లో వాలిపోతుంటారు. సోదరుడికి రాఖీ కట్టి గుండెల నిండా ఆనందాన్ని మోసుకెళ్తారు.