ఒకప్పుడు చాదస్తం.. ఇప్పుడదే శాస్త్రీయం..

ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు వంటి పెద్దవారు ఉంటే అది అలా చెయ్యకు.. ఇది ఇలా ఎందుకు చేశావు అని అంటే ఇంట్లో వారికి చిర్రెత్తుకొస్తుంది. నీదంతా చాదస్తం అమ్మమ్మా అంటూ ఈ కాలం మోడ్రన్ అమ్మాయి మూతి ముడుచుకుంటుంది. అదే సోషల్ మీడియా పుణ్యమా అని పొద్దున్న లేస్తే వచ్చే నీతి వాక్యాల మెసేజ్‌లతో పాటు, మన దేశంలో కాదు విదేశాల్లో అమెరికా, జపాన్, రష్యాలాంటి దేశాల్లో జరిపిన పరిశోధనల్లో తేలిన అంశం ఏంటంటూ వివరిస్తూ విశ్లేషణాత్మక వ్యాసం వచ్చిందనుకోండి అప్పుడు అమ్మమ్మ చెప్పిన విషయం నిజమే అని ఒక నిర్థారణకు వస్తాము.

రాత్రిపూట త్వరగా భోజనం చేసి ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేవండి అని నానమ్మ చెబితే వింటామా.. తిన్న వెంటనే పడుకుంటే బోలెడు జబ్బులు మీ వెంటే.. అని పరిశోధనలు చెబితే మొత్తానికే అన్నం తినడం మానేసి పుల్కాలు, రోటీలతో కడుపు నింపేస్తున్నారు.

తాతయ్య మంచం కింద రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు పెట్టుకుని ఉదయాన్నే తాగుతుంటే.. ఎందుకు తాతయ్య అందులో తాగుతున్నావు అంటే మంచిదే మనవరాలా అంటే వినం.. అదే ఇప్పడు రాగిలో శరీరానికి కావలసిన మూలకాలున్నాయి, అందానికి,ఆరోగ్యానికి రాగి నీళ్లు మంచివి అనేసరికి మార్కెట్లో వస్తున్న జగ్గులు, గ్లాసులు, వాటర్ బాటిళ్లతో సహా అన్నీ రాగివే దర్శనమిస్తున్నాయి ప్రతి ఇంట్లో.

లంఖణం పరమౌషధం అని చెబితే వినలేదు. ఓ జపాన్ శాస్త్రవేత్త క్యాన్సర్ వ్యాధికి విరుగుడు 15 రోజులకి ఒకసారి పొట్ట ఖాళీగా ఉంచండి, రోజులో 10గంటలు కడుపులో ఏ చెత్తా పడేయకండి.. అలా ఖాళీగా ఉంచితే క్యాన్సర్ వ్యాధి రాదు అని నిరూపించినందుకు అతడిని నోబెల్ బహుమతి వరించింది.

మన పూర్వీకులు ఆచరించిన ఆచార వ్యవహారాలపైన శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరిపి స్టాంప్‌ వేస్తున్నారు. ఆధునిక మానవుడు వాటిని ఆచరించేస్తున్నాడు. సో.. మార్పు మంచిదే.