అమరావతి చరిత్రలో మరో కీలక అడుగు

బాండ్లే మా బ్రాండ్‌ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పటికే అమరావతి బాండ్లకు యమ క్రేజ్‌ రావడంతో.. ఇప్పుడు వాటిని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్టింగ్ చేశారు చంద్రబాబు. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులను సమీకరించే ఉద్దేశంతో ఈ బాండ్లను ఏపీ ప్రభుత్వం విక్రయిస్తోంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి చరిత్రలో మరో కీలక అడుగు పడింది. అత్యాధునిక రాజధాని నిర్మాణం కోసం ఉద్దేశించిన అమరావతి బాండ్స్, బీఎస్ఈలో లిస్ట్ అయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కోలాహలంగా సాగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన తరువాత 9.15 గంటలకు సెరిమోనియల్‌ బెల్‌ మోగించి లిస్టింగ్‌‌ను ప్రారంభించారు. బీఎస్‌ఈ సీఈఓ ఎండీ ఆశిష్‌‌కుమార్‌, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.

అమరావతి బాండ్లను ఏపీప్రభుత్వం ఆఫర్ చేయగా 1.53 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కయిబ్ అయ్యాయి. బీఎస్‌ఈలో అమరావతి బాండ్లు లిస్ట్‌ కావడం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. దేశ చరిత్రలో రాజధాని కోసం బాండ్లు సేకరించడం తొలిసారన్నారు. గంట వ్యవధిలో ఒకటిన్నర రేట్లు ఓవర్ స్క్రైబ్‌ కావడం పెట్టుబడిదారులకు అమరావతి పట్ల ఉన్ననమ్మకమని తెలిపారు.

రాజధాని నిర్మాణం చాలా కష్టమని చంద్రబాబు తెలిపారు. తనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానన్నారు. లాండ్‌ పూలింగ్‌లో రైతులు తనను నమ్మి 35 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు.

2029 కల్లా ఒక ట్రిలియల్ డాలర్లకు ఏపీ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఈ-గవర్నెన్స్ రంగాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు.

చంద్రబాబు పాలనలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని బీఎస్‌ఈ సీఈఓ, ఎండీ ఆశిష్‌కుమార్‌ అన్నారు. సాంకేతిక వినియోగంలో కూడా మొదటి స్థానంలో కొనసాగుతోందని ప్రశంసించారు..

అమరావతి బాండ్లు శుభసంకేతాలిచ్చాయి. లిస్టింగ్‌ చేసిన తొలిరోజే బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ భారీ లాభాలతో ముగిసింది.