రూ.5 వేలు లంచమిస్తేనే.. టీవీ5 ఎంట్రీతో డాక్టర్ భాగోతం బట్టబయలు

corruption in govt-hospital

శవాలపై రాబంధుల్లా తయారయ్యారు.. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని కొందరు డాక్టర్లు. శవ పంచనామా చేయాలంటే 5 వేలు డిమాండ్‌ చేసే స్థాయికి దిగజారారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే పంచనామా చేసి డెడ్‌బాడీ అప్పగించేదే లేదని నిస్సిగ్గుగా చెబుతున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్న వైద్యుల బాగోతాన్ని బట్టబయలు చేసింది టీవీ5. అవినీతి పరులను ఏరిపారేసి ఆస్పత్రిని ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు బాధితులు.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల లంచావతారం మరోసారి బయటపడింది. శవ పంచనామా చేయాలంటే ఇక్కడి డాక్టర్లకు అడిగినంత ముట్టచెప్పాల్సిందే.. లేదంటే మృతుని కుటుంబ సభ్యులకు నరకం చూపిస్తారు. ఆప్తులను కోల్పోయి దుఖంలో ఉన్నారే అన్న కనీస కనికరం లేకుండా డబ్బుల కోసం జనాన్ని పట్టి పీడిస్తున్నారు డాక్టర్లు. అడిగినంత ఇవ్వకపోతే.. పోస్టుమార్టం చేసేది లేదు.. డెడ్‌బాడీ అప్పగించేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. ఇలా ఓ మృతుని కుటంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడ్డాడు.. డాక్టర్ తిలక్.

విజయవాడ అయోధ్య నగర్‌కు చెందిన ఎలుగుశివప్రసాద్‌ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇటీవలే ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివప్రసాద్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే అతని డెడ్‌బాడీకి పోస్టుమార్టం చేసేందుకు డాక్టర్లు 5 వేల రూపాయలు డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేమని చెబుతున్నా కనికరించకుండా… డబ్బులు ఇవ్వకుంటే శవాన్ని ముక్కలు ముక్కలు చేసి చేతిలో పెడతామంటూ హెచ్చరించారు. బాధితులు విషయాన్ని టీవీ5 కి చెప్పగా… ప్రతినిధులు బాధితులతో కలిసి డాక్టర్‌ దగ్గరికి వెళ్లారు. తమ దగ్గర వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. చనిపోయిన వ్యక్తికి 5 లక్షలు చంద్రన్న బీమా వస్తుందిగా.. 5 వేలు ఇవ్వడానికేంటి అంటూ ఉచిత సలహాలు ఇచ్చాడు.. మార్చురీ డాక్టర్ తిలక్‌‌. ఈ తతంగమంతా టీవీ 5 కెమెరాలో రికార్డ్‌ అయ్యింది.

తమకు వచ్చిన కష్టాన్ని బాధితులు ఎమ్మెల్యే బోండా ఉమకు వివరించగా ఆయన వచ్చి డాక్టర్లను నిలదీశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే దారికి వచ్చిన డాక్టర్లు…. వెంటనే పంచనామా చేసి దేహాన్ని బంధువులకు అప్పగించారు.

ఆప్తులు చనిపోయి తాము బాధలో ఉంటే.. డాక్టర్లు ఇలా డబ్బుల కోసం జలగల్లా పట్టి పీడించడం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ ఆస్పత్రిలో కొందరు డాక్టర్లు శవాలపై రాబంధుల్లో తయారయ్యారని విమర్శిస్తున్నారు.

వేలకు వేలు జీతాలు తీసుకుంటూ… శవాలపై చిల్లర ఏరుకుంటున్న మార్చురీ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి అవినీతిపరులను ఏరిపారేసి… ప్రభుత్వాసుపత్రిని ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు.