కిలో టీ పొడి రూ.40,000లు.. ఏంటో అంత స్పెషల్..

ఓ కప్పు కమ్మని కాఫీ లేదా టీ తాగాలంటే మంచి రుచికరమైన సువాసనలు వెదజల్లే టీ పొడిని ఎంచుకుంటాము. మహా అయితే ఎంత తోటనించి తాజాగా తీసుకు వచ్చినా వెయ్యి నుంచి 5 వేల వరకు ఉండొచ్చనుకుంటాము. కానీ ఇక్కడ ఏకంగా కేజీ టీ పొడి ధర రూ.40 వేలంటే మాటలా.. ఏంటో అంత స్పెషల్ అనే ఆశ్చర్యం కలగక మానదు.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం డోన్సీ పోలో టీ ఎస్టేట్‌లో పండించిన ‘గోల్డెన్ నీడిల్స్’ రకం టీ పొడికి అంత డిమాండ్ ఉంది మరి. గురువారం వేలం పాటలో తేనీయ ప్రియులు కేజీ ‘గోల్డెన్ నీడిల్స్’ టీపొడి రూ.40 వేలు ఇచ్చి మరీ కొనుక్కెళ్లారు. గువహటికి చెందిన అస్సాం టీ ట్రేడర్స్ వేలం పాటలో దక్కించుకుంది. ఈ గోల్డెన్ నీడిల్స్ తేయాకులు బంగారు రంగు పూత కలిగి మృదువుగా ఉంటాయి. తేలిక పాటి మొగ్గలతో ఉన్న వాటిని తీసుకు వచ్చి టీ పొడి తయారు చేస్తారు.